ఎస్పీలో చేరిన మాజీమంత్రి.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు
Swami Prasad Maurya joins SP. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ కార్యకలాపాలు
By Medi Samrat Published on 14 Jan 2022 9:46 AM GMTఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. ఇటీవల యోగి కేబినెట్‌కు రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య ఈరోజు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరారు. ఆయనతో పాటు ధరమ్ సింగ్ సైనీ, 6 మంది ఎమ్మెల్యేలు కూడా ఎస్పీ సైకిల్ ఎక్కారు. మీడియా సమావేశానికి ముందు స్వామి ప్రసాద్ మౌర్య చేసిన ప్రకటన కూడా వెలువడింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశ, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించిందని మౌర్య అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వాన్ని తొలగించి దోపిడీ నుండి విముక్తి చేయాలని మౌర్య అన్నారు. గత 5 ఏళ్లలో రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ, రిజర్వేషన్ రంగాల్లో వెనుకబడిన, దళితులు పూర్తిగా దోపిడీకి గురయ్యారని ధరమ్ సింగ్ సైనీ అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే మకర సంక్రాంతి సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరుతున్నట్లు తెలిపారు. అంతకుముందు స్వామి మౌర్య మాట్లాడుతూ.. బీజేపీ పాము అయితే.. తాను ముంగిస అని అన్నారు.
ఇదిలావుంటే.. స్వామి ప్రసాద్ మౌర్య కుమార్తె సంఘమిత్ర మౌర్య ఇప్పటికీ బిజెపి ఎంపీగా ఉన్నారు. సంఘమిత్ర బదౌన్ పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికయ్యారు. మరోవైపు ఈ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల టిక్కెట్లు కోత పడబోతోందని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేయడంతో.. కొందరు నేతలు టికెట్ ఆశించి ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు.