బెంగళూరు (కర్ణాటక): ప్రస్తుతం దేశంలో మంకీపాక్స్ టెన్షన్ నెలకొన్న సంగతి తెలిసిందే..! బెంగళూరు విమానాశ్రయంలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్నాయని అనుమానించబడిన ఇథియోపియన్ పౌరుడికి మంకీపాక్స్ లేదని లేదని తేలింది. అతడికి చికెన్‌పాక్స్ ఉన్నట్లు నిర్ధారించబడింది. కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్ మాట్లాడుతూ.. ఇథియోపియన్ వ్యక్తిలో ఈ నెల ప్రారంభంలో బెంగళూరు విమానాశ్రయంలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో.. అతడికి పరీక్షలు నిర్వహించారని అన్నారు.
"ఈ నెల ప్రారంభంలో బెంగళూరుకు వచ్చిన మధ్య వయస్కుడైన ఇథియోపియన్ పౌరుడికి మంకీపాక్స్ లక్షణాల అనుమానంతో పరీక్షలు చేశారు. అయితే అతని నివేదిక ఇప్పుడు చికెన్‌పాక్స్ కేసుగా నిర్ధారించారు" అని సుధాకర్ తన ట్వీట్‌లో తెలిపారు. "బాధిత దేశాల నుండి బెంగళూరు / మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులందరినీ జ్వరం, చలి చర్మం దద్దుర్లు, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలతో వచ్చిన వ్యక్తులను పరీక్షించడం, వేరుచేయడం వంటివి జరుగుతోంది." అని అన్నారు.
మంకీపాక్స్ అనేది ఒక అరుదైన వైరల్ వ్యాధి. ఇది ప్రధానంగా మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికాలో వస్తుంది. అంటువ్యాధి కావడం.. ఇప్పుడు పలు దేశాల్లో ప్రత్యక్షమవుతూ ఉండడంతో అధికారులు అలెర్ట్ అవుతూ ఉన్నారు.