పారిపోయి తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అరెస్టు
ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐసిస్ ఉగ్రవాది షానవాజ్ అలియాస్ షఫీ ఉజామాను అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 2 Oct 2023 11:33 AM GMTఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐసిస్ ఉగ్రవాది షానవాజ్ అలియాస్ షఫీ ఉజామాను అరెస్ట్ చేశారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా అతడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కొద్దిరోజుల కిందటే ప్రకటించింది. అతడి తలపై రూ.3 లక్షల రివార్డు కూడా ఉంది. పూణే ఐసిస్ మాడ్యూల్ కేసులో ఎన్ఐఏ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు. పూణే పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న అతడిని ఎట్టకేలకు పట్టుకోగలిగారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని కూడా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీకి చెందిన షఫీ ఉజామా వృత్తి రీత్యా ఇంజనీర్. ఉత్తరాదిన ఉగ్రదాడులు చేయాలని అతడికి బయటదేశాల నుండి సూచనలు అందాయి. అతడి గురించి తెలుసుకున్న పోలీసులు పట్టుకోగలిగారు. ఐఈడీల తయారీలో వినియోగించే పలుడు పేలుడు పదార్థాలను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. షఫీ ఉజామా, మరో ఇద్దరిని పుణె మాడ్యూల్ కేసులో కొత్రూడ్ పోలీసులు జూలై 18న అరెస్ట్ చేశారు. పోలీసు వాహనం నుంచి షఫీ కిందకు దూకేసి తప్పించుకోగా, ఆ తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ చిక్కాడు. పూణే నుండి పారిపోయిన తర్వాత దేశ రాజధాని ప్రాంతానికి వచ్చి నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పూణె ఐసిస్ మాడ్యూల్ కేసులో ఇటీవలే షానవాజ్‌తో సహా నలుగురు ఉగ్రవాద అనుమానితుల చిత్రాలను NIA విడుదల చేసింది. వారిపై విశ్వసనీయ సమాచారం అందించే వారి కోసం ఒక్కొక్కరిపై 3 లక్షల రివార్డును ప్రకటించింది. సమాచారం ఇచ్చే వ్యక్తి గుర్తింపు గోప్యంగా ఉంచుతామని ఏజెన్సీ తెలిపింది. ఐసిస్ అనుమానితులుగా అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులతో కలిసి షానవాజ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.