సుస్మితా సేన్ కనుక్కుంది.. కానీ 'మోదీ' సర్కార్ కనిపెట్టలేకపోయింది
Sushmita Sen can find Lalit Modi but Narendra Modi can't. దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీ.. ఇటీవలే మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ తో
By Medi Samrat Published on 22 July 2022 9:06 PM IST
దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీ.. ఇటీవలే మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ తో కలిసి ఉన్న ఫోటో సంచలనం సృష్టించింది. ఆయన ఐపీఎల్ లీగ్ లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఆయన కోసం భారత్ లో దర్యాప్తు సంస్థలు ఎదురుచూస్తున్నాయి. లలిత్ మోదీ-సుస్మితా సేన్ ల అఫైర్ ను ప్రస్తావిస్తూ ఆప్ నేత సంజయ్ సింగ్ కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లలిత్ మోదీ ఎక్కడున్నాడో సుస్మితా సేన్ కనుక్కుంది కానీ.. మోదీ సర్కారు మాత్రం కనిపెట్టలేకపోయింది అంటూ విమర్శించారు. ఆప్ మంత్రి మనీస్ సిసోడియాపై మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సంజయ్ సింగ్ ఇలా స్పందించారు. కేజ్రీవాల్ ప్రభుత్వ చిత్తశుద్ధిని, నిజాయతీని చూసి మోదీ సర్కారు భయపడుతోందని సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. తప్పుడు ఆరోపణలతో ఆప్ నేతలను అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము బ్రిటిషర్లకు భయపడకుండా ఉరికంభం ఎక్కిన భగత్ సింగ్ వారసులమని, బ్రిటిషర్లకు క్షమాణలు చెప్పిన సావర్కర్ వారసులం కాదని వ్యాఖ్యానించారు. జైలు అంటే ఆప్ నేతలకు భయం లేదని, బీజేపీనే భయపడుతుందని ధ్వజమెత్తారు. 2021-22లో ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది. అయితే దీనిలో నిబంధనలు అతిక్రమించారని, దీని వల్ల లిక్కర్ మాఫియాకు రూ.144 కోట్ల ప్రయోజనం చేకూరిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఫైనాన్షియల్ క్విడ్ ప్రోకో జరిగిందని, ఎక్సైజ్ శాఖ ఇంఛార్జ్‌గా ఉన్న సిసోడియానే దీన్ని అమలు చేశారని చీఫ్ సెక్రెటరీ నివేదిక తెలిపింది.