పురుషులు కూడా గృహహింసకు గురవుతున్నారు.. జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి

Supreme Court to hear PIL for setting up of National Commission for Men. పురుషుల కోసం జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటీషన్‌ను జులై 3న

By Medi Samrat  Published on  1 July 2023 1:48 PM GMT
పురుషులు కూడా గృహహింసకు గురవుతున్నారు.. జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి

పురుషుల కోసం జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటీషన్‌ను జులై 3న సుప్రీంకోర్టు విచారించనుంది. న్యాయవాది మహేష్ కుమార్ తివారీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పెళ్లయిన పురుషుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటాను పిటిషన్‌లో పొందుప‌రిచారు.

జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాల‌తో కూడిన సుప్రీం ధర్మాసనం సోమవారం (జూలై 3) పిటిషన్‌పై వాద‌న‌లు వింటారు. దేశంలో మరణాలకు సంబంధించి 2021లో ప్రచురించిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాలను పిటిషనర్ మహేష్ కుమార్ తివారీ తన పిటిషన్‌లో ఉదహరించారు.

ఎన్‌సిఆర్‌బి డేటాను ఉటంకిస్తూ.. "2021 సంవత్సరంలో సుమారు 33.2 శాతం మంది పురుషులు కుటుంబ సమస్యల కారణంగా తమ జీవితాలను ముగించారు. 4.8 శాతం మంది పురుషులు వివాహ సంబంధిత కారణాల వల్ల ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని పిటీషన్ లో పేర్కొన్నారు. 2021లో దేశవ్యాప్తంగా మొత్తం 1,64,033 మంది ఆత్మహత్య చేసుకున్నారని పిటిషన్‌‌లో పేర్కొన్నారు. వారిలో 1,18,979 మంది పురుషులు కాగా.. 45,026 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. అందులో.. 81,0 63 మంది పెళ్లి అయిన పురుషులు కాగా.. 28,680 మంది వివాహిత మహిళలని వివరించారు.

పెళ్లైన పురుషుల ఆత్మహత్యల సమస్యను పరిష్కరించేందుకు.. గృహ హింసకు గురవుతున్న పురుషుల ఫిర్యాదులను స్వీకరించడానికి జాతీయ మానవ హక్కుల సంఘం తగు సూచనలు చేయాలన్నారు. జాతీయ పురుషుల కమిషన్‌‌ను ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని మహేష్ కుమార్ తివారీ తన పిటిషన్‌లో కోరారు.


Next Story