వీధి కుక్కల కేసుపై విచారణ..ప్రభుత్వాల వైఫల్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది

By -  Knakam Karthik
Published on : 13 Jan 2026 12:58 PM IST

National News, Delhi, Supreme Court, Stray Dogs, Central Government, State Governments

వీధి కుక్కల కేసుపై విచారణ..ప్రభుత్వాల వైఫల్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

ఢిల్లీ: వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) నిబంధనలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వైఫల్యం కారణంగా సమస్య వెయ్యిరెట్లు పెరిగిందని స్పష్టం చేసింది.

కుక్క కాటు బాధితురాలి కీలక వాదన

కోర్టులో వాదనలు వినిపించిన ఓ కుక్క కాటు బాధితురాలు, కుక్కలపై క్రూరత్వమే దాడులకు కారణమవుతుందని పేర్కొన్నారు. “నాపై దాడి చేసిన కమ్యూనిటీ డాగ్ గతంలో తీవ్ర హింసకు గురైంది. కొట్టడం, రాళ్లు వేయడం వంటివి చేయడంతో అది భయంతో రక్షణాత్మక దాడి చేసింది. భయం కుక్కల్లో దాడి ప్రవర్తనను ప్రేరేపిస్తుంది” అని ఆమె కోర్టుకు వివరించారు.

డాగ్ ఫీడర్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం

కుక్కలకు ఆహారం పెట్టేవారిపై కూడా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. కుక్కలకు మీరు ఆహారం పెడితే మీ ఇళ్లలోనే పెట్టుకోండి. ప్రజా ప్రదేశాల్లో తిరుగుతూ కాటు వేయడం ఎందుకు? కుక్క కాటు ప్రభావం జీవితాంతం ఉంటుంది” అని స్పష్టం చేసింది.కుక్కల దాడులు, మరణాలకు ఫీడర్లకూ బాధ్యత ఉండాలని వ్యాఖ్యానించింది.

ప్రభుత్వాలకు హెచ్చరిక

కుక్క కాట్ల వల్ల మనుషులు ప్రాణాలు కోల్పోతే సంబంధిత ప్రభుత్వాలపై భారీ పరిహారం విధిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. 1950ల నుంచే పార్లమెంట్ ఈ అంశాన్ని పరిశీలిస్తున్నా, ఇప్పటికీ సమర్థవంతమైన అమలు లేకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

‘మనుషులకే నా భావోద్వేగాలు’ – ధర్మాసనం

జంతు హక్కుల కార్యకర్తల తరఫున వాదించిన న్యాయవాదికి ధర్మాసనం స్పందిస్తూ, మీ భావోద్వేగాలు కేవలం కుక్కలకే పరిమితమయ్యాయి. నాకు మనుషుల పట్ల భావోద్వేగాలు ఉన్నాయి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనికి న్యాయవాది మేనకా గురుస్వామి, ABC నిబంధనలు పార్లమెంట్ ఆలోచన ఫలితమే అని సమాధానమిచ్చారు.

గేటెడ్ కమ్యూనిటీల్లో వీధి కుక్కలకు హక్కుల్లేవు

సీనియర్ అడ్వకేట్ అరవింద్ దాతర్ వాదిస్తూ, “గేటెడ్ సొసైటీలో ఉన్న కుక్క కూడా వీధి కుక్కే. అక్కడ ఉండే హక్కు లేదు” అని అన్నారు. నవంబర్ 7 ఉత్తర్వులను ఎయిర్‌పోర్టులు, కోర్టులు, పబ్లిక్ పార్కులకు కూడా వర్తింపజేయాలని కోర్టును కోరారు. విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్‌వీ అంజారియా న్యాయమూర్తుల ధర్మాసనం ఈ అంశంపై విచారణ కొనసాగిస్తోంది.

Next Story