'మళ్లీ మళ్లీ హోటల్‌కి ఎందుకు వెళ్లావు'.. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను మందలించిన సుప్రీం
పెళ్లి చేసుకుంటానని ఓ మహిళతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు బుధవారం సమర్థించింది.
By Medi Samrat
పెళ్లి చేసుకుంటానని ఓ మహిళతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు బుధవారం సమర్థించింది. అదే సమయంలో కోర్టు మహిళను మందలిస్తూ వివాహేతర సంబంధం పెట్టుకుని నేరం చేసిందని తెలిపింది. వివాహ సమయంలో భర్తతో కాకుండా వేరొక వ్యక్తితో శారీరక సంబంధాలు కలిగి ఉన్నట్లయితే ఆమెపై కేసు పెట్టవచ్చని కోర్టు హెచ్చరించింది.
అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేయరాదని మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం మహిళ అభ్యర్థనను తిరస్కరించి, ఆ వ్యక్తి ముందస్తు బెయిల్‌ను సమర్థించింది.
పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మహిళతో శారీరక సంబంధాలు కొనసాగిస్తున్నాడని.. వారిద్దరూ పలుమార్లు హోటల్‌కు వెళ్లి శారీరక సంబంధాలు పెట్టుకున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై ‘నీకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు.. పరిణతి చెందిన వ్యక్తివి.. అయినా వివాహేతర సంబంధం కొనసాగించావ్.. అతడి అభ్యర్థనపై మళ్లీ మళ్లీ హోటల్‌కి ఎందుకు వెళ్లావు.. వివాహేతర సంబంధం పెట్టుకుని నేరం చేశావని’’ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వివాహిత, వ్యక్తి 2016లో సోషల్ మీడియా ద్వారా కలుసుకున్నారు. అప్పటి నుండి రిలేషన్‌లో ఉన్నారు. భాగస్వామి ఒత్తిడితోనే.. ఆమె తన భర్త నుండి విడాకులు కోరానని, ఈ ఏడాది మార్చి 6న కుటుంబ న్యాయస్థానం విడాకులు కూడా ఆమోదించిందని మహిళ పేర్కొంది.
విడాకులు తీసుకున్న కొంతకాలం తర్వాత.. మహిళ పెళ్లి చేసుకోవాలని తనతో రిలేషన్‌లో ఉన్న వ్యక్తిని కోరింది. కానీ అతను నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన ఆమె బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేసి పెళ్లికి హామీ ఇచ్చి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. న్యాయపోరాటం ప్రారంభం కావడంతో పాట్నా హైకోర్టు ఆ వ్యక్తికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దానిని సవాలు చేస్తూ సుప్రీంకు వెళ్లగా.. అక్కడ కూడా మహిళకు ఎదురుదెబ్బ తగిలింది.