నెలలో మూడు రోజుల పాటు ఒక మహిళను 'అస్పృశ్యురాలు'గా పరిగణించి, నాలుగో రోజు నుంచి ఆ భావనను విడనాడటం సరికాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలోని శబరిమల ఆలయ ప్రవేశం, మతపరమైన స్వేచ్ఛ మరియు మహిళల పట్ల వివక్షకు సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
2018 నాటి శబరిమల తీర్పులో, మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడం ఆర్టికల్ 17 ప్రకారం 'అస్పృశ్యత' కిందకు వస్తుందని జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పేర్కొనగా, కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశం పాశ్చాత్య దేశాలు భావించినట్లుగా పితృస్వామ్య ధోరణిలో లేదని ఆయన వాదించారు.
శబరిమలలో ఆంక్షలు కేవలం వయస్సు ఆధారంగానే ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర అయ్యప్ప దేవాలయాల్లో మహిళలకు అనుమతి ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలోనే స్పందించిన జస్టిస్ నాగరత్న.. ఒక మహిళగా చెబుతున్నానని, నెలలో కొన్ని రోజులు మాత్రమే ఒక వ్యక్తిని అస్పృశ్యురాలిగా చూడటం సరైన పద్ధతి కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.