'నీ కూతుళ్ల గురించి ప‌ట్టించుకోని నువ్వు ఎలాంటి మనిషివి'.?.. ఆ తండ్రిపై 'సుప్రీం' సీరియ‌స్‌

వరకట్న వేధింపుల కేసులో దోషిగా తేలిన జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన యోగేశ్వర్ సాహో అనే వ్యక్తి పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

By Medi Samrat  Published on  25 Jan 2025 9:28 AM IST
నీ కూతుళ్ల గురించి ప‌ట్టించుకోని నువ్వు ఎలాంటి మనిషివి.?.. ఆ తండ్రిపై సుప్రీం సీరియ‌స్‌

వరకట్న వేధింపుల కేసులో దోషిగా తేలిన జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన యోగేశ్వర్ సాహో అనే వ్యక్తి పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తన కుమార్తెలను నిర్లక్ష్యం చేసి భార్యతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అప్పీలుదారునిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఫైర్ అయ్యింది.

మీరు రోజంతా ఇంట్లో సరస్వతి పూజ, లక్ష్మీ పూజ చేస్తారు. కానీ.. మీ కూతుళ్ల గురించి కూడా పట్టించుకోరు. నీ కూతుళ్ల గురించి ప‌ట్టించుకోని నువ్వు ఎలాంటి మనిషివి అని బెంచ్ ప్ర‌శ్నించింది. అలాంటి క్రూరమైన వ్యక్తిని మన కోర్టులోకి ఎలా అనుమతించగలం.? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పిటిషనర్ తన వ్యవసాయ భూమిని తన కుమార్తెలకు బదిలీ చేయడానికి అంగీకరిస్తేనే.. నీకు ఉపశమనం లభిస్తుందని కోర్టు నొక్కి చెప్పింది.

2015లో కట్కమ్‌డాగ్ గ్రామానికి చెందిన యోగేశ్వర్ సాహో అతని భార్య పూనమ్ దేవిని రూ. 50 వేలు కట్నం కోసం వేధించినందుకు IPC సెక్షన్ 498A కింద హజారీబాగ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు దోషిగా నిర్ధారించి రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

యోగేశ్వర్‌, పూనమ్‌లకు 2003లో వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2009లో పూనమ్ దేవి వరకట్న వేధింపులు, బలవంతంగా గర్భసంచి తొలగింపు, ఆ తర్వాత తన భర్త పునర్వివాహం చేసుకున్నారని ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. తనకు, తన కూతుళ్లకు భరణం ఇవ్వాలని కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. సాహో తన భార్యకు నెలకు రూ.2,000, 18 ఏళ్లు నిండే వరకు ఒక్కో కూతురికి నెలకు రూ.1,000 చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది.

సాహో జార్ఖండ్ హైకోర్టులో అతని శిక్షకు వ్యతిరేకంగా కోర్టులో అప్పీల్ చేశాడు. అక్క‌డ కూడా అత‌నికి ఉప‌శ‌మ‌నం దొర‌క‌లేదు. సెప్టెంబర్ 2024న హైకోర్టు ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. దీని తరువాత యోగేశ్వర్ డిసెంబర్ 2024లో ఉపశమనం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో సుప్రీం యోగేశ్వర్‌పై ఆగ్రహం వ్య‌క్తం చేసింది.

Next Story