తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్ల పెంపుపై రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు, ఆంధ్రప్రదేశ్‌లోని 175 సీట్లను 225 వరకు పెంచాలని పర్యావరణ నిపుణుడు పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న నిబంధనలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోర్టును కోరారు. పిటిషన్‌లో తెలంగాణ, ఏపీ, కేంద్రం, ఈసీని ప్రతివాదులుగా చేర్చారు.
ఈ మేరకు విచారణ జరిపిన జస్టిస్ జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పలువురు తీర్పు గురించి ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. అన్నీ అనుకున్నట్లుగా తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కి, ఏపీలో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది ఇప్పుడే జరిగే పని కాదనే కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి.