హిమాచల్‌ప్రదేశ్ సీఎంగా సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్, ఉప ముఖ్యమంత్రిగా అగ్ని హోత్రిల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. హిమాచల్ రాజధాని సిమ్లాలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన నాయకులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వేదికపై హిమచల్‌ప్రదేశ్‌న్ని ఆరు సార్లు పాలించిన రాజవంశీకుడు దివగంత వీరభద్ర సింగ్‌కి నాయకులందరూ నివాళులర్పించారు. ఆ తర్వాత వేదికపైనే వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్‌ను రాహుల్ గాంధీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. కాగా హిమచల్‌ప్రదేశ్ సీఎం పదవికి పలువురు ప్రయత్నాలు చేయడంతో ఒకరిని ఎంపిక చేయడం హైకమాండ్‌కి క అతిపెద్ద సవాలుగా మారింది. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించి,సుఖ్వీందర్‌సింగ్‌ని సీఎంగా శనివారం కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే .ఇదిలా ఉండగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సుఖ్వీందర్ సింగ్ బస్సు డ్రైవర్ కుమారుడు. ఆయన సిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం క్యాంపస్ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.