పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి ఆయనే..

Charanjit Singh Channi new Punjab CM. పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో మొదలైన లుకలుకలు చివరికి కెప్టెన్ అమరీందర్ సింగ్

By Medi Samrat  Published on  19 Sep 2021 11:18 AM GMT
పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి ఆయనే..

పంజాబ్‌ రాజకీయాల్లో కెప్టెన్‌ అమరీందర్‌ తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ (47) పేరును కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా ఖరారు చేసింది. చరణ్‌జిత్‌ సింగ్‌ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి హరీశ్‌ రావత్‌ ఆదివారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. కాసేపట్లో కొత్త సీఎల్పీ నాయకుడు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ కలవనున్నారు. అమరీందర్ సింగ్ తాను ముఖ్యమంత్రి కొనసాగలేనంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. ఇన్నాళ్లూ అన్ని రాజకీయ మార్పులను అంగీకరించానని కానీ ఇకపై పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. ఈ అవమానాలు చాలని , ఇలా జరగడం ఇది మూడోసారని సింగ్‌ ఆవేదన వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

పీసీసీ చీఫ్‌ నవజ్యోత్ సిద్ధూ శనివారం సాయంత్రం సీఎల్‌పీ సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకొన్ని నెలలే ఉన్న సందర్బంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పులు జరుగుతాయనే ఊహాగానాలకు ఈ సమావేశం తెరలేపింది. ఈ నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. 'ఇంతటి అవమానాన్ని నేను భరించలేను. ఈ అవమానాలు ఇక చాలు. ఇది మూడోసారి. ఇలాంటి అవమానాలతో నేను పార్టీలో ఉండాలనుకోవడం లేదు' అని సోనియా గాంధీతో చెప్పిన కొన్ని గంటలకే రాజీనామాను సమర్పించి వెళ్లిపోయారు. ఆయన భవిష్యత్తు కార్యాచరణ గురించి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.


Next Story