Video : అంద‌రూ చూస్తుండ‌గానే మాజీ సీఎంపై కాల్పులు.. తృటిలో..

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ బాదల్‌పై దాడి జరిగింది.

By Medi Samrat  Published on  4 Dec 2024 5:06 AM GMT
Video : అంద‌రూ చూస్తుండ‌గానే మాజీ సీఎంపై కాల్పులు.. తృటిలో..

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ బాదల్‌పై దాడి జరిగింది. ప్ర‌స్తుతం ఆయ‌న సురక్షితంగా ఉన్నప్పటికీ గోల్డెన్ టెంపుల్‌లో ఆయ‌న‌పై కాల్పులు జ‌రిగాయి. సుఖ్‌బీర్ శ్రీ అకల్ తఖ్త్ సాహిబ్ ఇచ్చిన మతపరమైన శిక్షను అనుభవించడానికి శ్రీ హర్మందిర్ సాహిబ్ చేరుకున్నాడు.

కాల్పులు జ‌రిపిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం 9 గంటల తర్వాత సుఖ్‌బీర్‌ను సేవాదర్ పాత్రను పోషించేందుకు ప్రధాన ద్వారం వద్ద ఉంచినప్పుడు ఈ సంఘటన జరిగింది. గేటుకు అవతలివైపు సుఖ్‌దేవ్ సింగ్ ధిండా కూడా ఉన్నారు. దర్బార్ సాహిబ్‌లో తుపాకీ కాల్పుల శబ్దం భయానక వాతావరణాన్ని సృష్టించింది.

నిందితుడిని నారాయణ్ సింగ్ జోరాగా గుర్తించినట్లు సమాచారం. నిందితుడు డేరా బాబా నానక్‌కు చెందినవాడు. దాల్ ఖల్సాకు బంధువు అని చెప్పారు. కాల్పులు జరిపేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. సుఖ్‌బీర్ బాదల్ చుట్టూ నిలబడి ఉన్న వ్యక్తులు వెంటనే అతనిని పట్టుకుని చేయి పైకి లేపడంతో బుల్లెట్ గాలిలోకి వెళ్లిపోయింది. ప్రధాన గేటు ముందు ఈ ఘటన జరిగింది. సుఖ్‌బీర్ బాదల్ కాలికి ఫ్రాక్చర్ అయినందున ఆయ‌న‌ కుర్చీపై కూర్చొని సేవ చేస్తున్నాడు.

మూలాల ప్రకారం.. నిందితుడు మంగళవారం కూడా శ్రీ హర్మందిర్ సాహిబ్‌లో తిరుగుతూ కనిపించాడు. ఇంటెలిజెన్స్ సమాచారం అందుకున్న పోలీసులు కూడా అప్రమత్తమై అతనిపై నిఘా పెట్టారు. సుఖ్‌బీర్ బాదల్ భద్రత విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అకాలీ నేతలు ఆరోపించారు. మరోవైపు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏడీసీపీ హర్పాల్ సింగ్ తెలిపారు. సుఖ్‌బీర్ బాదల్‌కు సరైన భద్రత కల్పించామ‌న్నారు. దాడి చేసిన వ్యక్తి నిన్న కూడా ఇక్కడే ఉన్నాడు.. ఈ రోజు కూడా అతడు మొదట గురూజీకి నమస్కరించాడని.. ఎవరికి బుల్లెట్ గాయాలు అవ‌లేద‌ని తెలిపారు.

Next Story