సెకండ్ వేవ్ సమయంలో యూపీ, బీహార్ ప్రాంతాల్లో గంగానదిలో పెద్ద ఎత్తున మృతదేహాలు కొట్టుకువచ్చాయి. గంగానది ఒడ్డున ఇసుకలో పెద్ద ఎత్తున శవాలు కూడా బయటకు రావడంతో కరోనా మృతులవేననే అనుమానాలు వెంటాడాయి. గంగా నదిలో కరోనా ఆనవాళ్లను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో అధ్యయనం మొదలు పెట్టింది. ప్రభుత్వం ఆదేశించిన అధ్యయనంలో గంగా నదిలోని నీటిలో కరోనావైరస్ ఆనవాళ్లు కనుగొనబడలేదని స్పష్టంగా తెలిసింది. కన్నూజ్, ఉన్నవో, కాన్పూర్, హమీర్‌పూర్, అలహాబాద్, వారణాసి, బాలియా, బక్సర్, ఘాజిపూర్, పాట్నా, ఛప్రా ప్రాంతాల్లోని గంగా నది నుంచి నీటి నమూనాలను తీసుకొని పరిశీలించారు.
రెండు దశల్లో చేపట్టిన ఈ అధ్యయనంలో గంగానదిలో కరోనావైరస్ జాడ లేదని పరిశోధకులు వెల్లడించారు. నీటి నమూనాల నుంచి వైరస్ ఆర్ఎన్ఏను సేకరించి వైరోలాజికల్ పరీక్ష చేయగా ఎలాంటి కరోనా ఆనవాళ్లు లేవని నిర్ధారణ అయింది. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ (ఐఐటిఆర్), లక్నో, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మరియు రాష్ట్ర కాలుష్య నియంత్రణ నియంత్రణ సహకారంతో జల శక్తి మంత్రిత్వ శాఖలోని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. నిపుణులు సేకరించిన నమూనాలలో ఎక్కడా కరోనా వైరస్ జాడలు లేవు అని అధికారులు తెలిపారు.