క్రిస్టియన్ మిషనరీ సంస్థ విద్యార్థులను మత మార్పిడికి పాల్పడిందని ఆరోపిస్తూ మితవాద గ్రూపు బజరంగ్ దళ్ కార్యకర్తలు, వందలాది మంది స్థానికులతో కలిసి మధ్యప్రదేశ్‌లోని ఓ పాఠశాలలోకి సోమవారం ప్రవేశించి భవనంపై రాళ్లు రువ్వారు. 12వ తరగతి విద్యార్థులు మ్యాథ్స్ పరీక్షకు హాజరవుతుండగా ఈ హింస చోటుచేసుకుంది. విదిషా జిల్లాలోని గంజ్ బసోడా పట్టణంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థులను నిర్వాహకులు మతం మార్చారని సోషల్ మీడియాలో ఆరోపణల తర్వాత లక్ష్యంగా చేసుకున్నారు. సెల్‌ఫోన్ వీడియోలో భవనం వెలుపల భారీ గుంపు, పాఠశాల అడ్మినిస్ట్రేషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం కనిపించింది. జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడం కనిపించింది.
అక్కడ ఉన్న విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తృటిలో తప్పించుకున్నారు. గుంపు అద్దాల కిటికీలపై రాళ్లు రువ్వడంతో భయాందోళనలను వివరిస్తూ.. "మా ఏకాగ్రత దెబ్బతింది, పరీక్షను మళ్లీ నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము" అని ఒక విద్యార్థి చెప్పాడు. బ్రదర్ ఆంటోనీ, పాఠశాల మేనేజర్ మాట్లాడుతూ.. స్థానిక మీడియా ద్వారా దాడి గురించి ఒక రోజు ముందుగానే తనకు సమాచారం అందిందని చెప్పారు. ఆ తర్వాత పోలీసులకు, ప్రభుత్వానికి సమాచారం అందించామని తెలిపారు. అయితే పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. మత మార్పిడికి సంబంధించిన వాదనలను కూడా ఆయన ఖండించారు. ఫిర్యాదులో పేర్కొన్న పేర్లు ఏవీ విద్యార్థులతో సరిపోలడం లేదని పేర్కొన్నారు.
స్థానిక బజరంగ్ దళ్ యూనిట్ నాయకుడు నీలేష్ అగర్వాల్ పాఠశాలలో జరిగిన మత మార్పిడిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఘటన తర్వాత ఆ ప్రాంతంలోని ఇతర మిషనరీ పాఠశాలల్లో భద్రతా ఏర్పాట్లు చేశారు. విధ్వంసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మత మార్పిడిపై విచారణ ప్రారంభించామని, పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తామని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రోషన్ రాయ్ తెలిపారు. పాఠశాలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గతంలో విదిశ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసింది.