జూలోకి చొరబడ్డ వీధికుక్కలు.. అరుదైన జాతికి చెందిన జింకలను..
Stray dogs enter Delhi zoo, kill 3 endangered deers. ఢిల్లీ జూలో వీధి కుక్కల దాడిలో మూడు జింకలు చనిపోయాయి.
By Medi Samrat Published on 2 Dec 2022 8:45 PM ISTఢిల్లీ జూలో వీధి కుక్కల దాడిలో మూడు జింకలు చనిపోయాయి. అరుదైన జాతికి చెందిన జింకలు ఇవని తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవంబర్ 12వ తేదీ రాత్రి కొన్ని వీధికుక్కలు జూ లోకి చొరబడ్డాయి. అవి రెండు హగ్ జింకలు, ఒక సిక జింక మీద దాడి చేశాయి. ఈ సంఘటనలో ఆ మూడు జింకలు ప్రాణాలు కోల్పోయాయి. జూ ప్రహరీ ఎత్తు లేకపోవడం వల్లనే వీధి కుక్కలు సులువుగా లోపలికి ప్రవేశించాయని జూ అధికారులు తెలిపారు.
ఘటనపై విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. నిజాముద్దీన్ రైల్వే యార్డు సమీపంలోని జూ సరిహద్దు గోడ చాలా చిన్నదిగా ఉన్న కారణంగా వీధికుక్కలు జూలోకి ప్రవేశించడం సాధారణమని జూ అధికారులు అంటున్నారు. అంతర్గత విచారణతో పాటు సరిహద్దు గోడ ఎత్తును పెంచేందుకు టెండర్‌ను పిలిచినట్లు న్యూఢిల్లీ జూ డైరెక్టర్ ఆకాన్షా మహాజన్ తెలిపారు. వీధికుక్కల సమస్యను పరిష్కరించాలని జూ సిబ్బంది మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD)కి లేఖ రాసిందని, జూ పక్కనే ఉన్న ప్రాంతంలో వ్యర్థాలను కూడా తొలగించాలని రైల్వేలను కూడా కోరామని మహాజన్ చెప్పారు.
"నిర్మాణ పనులు పూర్తవ్వడానికి 2-3 నెలలు పడుతుంది, కానీ అప్పటి వరకు, మేము జూ వైపు నిఘా ఉంచాము," అని ఆకాన్షా మహాజన్ తెలిపారు."జూ ఆవరణలో మేము చాలాసార్లు వీధి కుక్కలను చూశాం. సరిహద్దు గోడ 6.5 అడుగుల ఎత్తులో ఉంది, అది ఇప్పుడు 20 అడుగులకు పెంచనున్నారు" అని జూ అధికారి తెలిపారు.