దారుణం.. తల్లి పక్కన నిద్రిస్తున్న పసికందును చంపిన వీధికుక్కలు
రాజస్థాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిద్రిస్తున్న తల్లి వద్ద నుండి పసికందును లాక్కెళ్లి వీధికుక్కలు కొట్టి చంపాయి.
By అంజి Published on 1 March 2023 8:00 AM GMTప్రతీకాత్మకచిత్రం
వీధి కుక్కలను నియంత్రణలో ఉంచేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా రాజస్థాన్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. సిరోహి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిద్రిస్తున్న తల్లి వద్ద నుండి పసికందును లాక్కెళ్లి వీధికుక్కలు కొట్టి చంపాయి. చిన్నారి తండ్రి సిరోహి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నెలరోజుల పాప తన తల్లి, ఇద్దరు తోబుట్టువులతో తన తండ్రి మంచం పక్కన నేలపై నిద్రిస్తుండగా.. కుక్కలు పసికందును నోటితో పట్టుకుని బయటకు లాక్కెళ్లాయి. పసికందు తండ్రి మహేంద్ర మీనా సిలికోసిస్‌తో బాధపడుతున్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.
అనంతరం వార్డు వెలుపల వాటర్ ట్యాంక్ దగ్గర పసికందు మృతదేహాన్ని లభ్యమైంది. సోమవారం అర్థరాత్రి రెండు కుక్కలు ఆస్పత్రిలోని టీబీ వార్డులోకి వెళ్లాయని, వాటిలో ఒకటి పసిపాపతో తిరిగి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలిందని పోలీసులు తెలిపారు. మంగళవారం రాజస్థాన్ అసెంబ్లీలో సిరోహి ఎమ్మెల్యే సన్యామ్ లోధా ఈ సంఘటనను వివరించాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. జిల్లా కలెక్టర్ భన్వర్ లాల్ ప్రకారం.. నర్సింగ్ అధికారి సురేష్ మీనా నిర్లక్ష్యానికి తక్షణమే సస్పెండ్ చేయబడింది. గార్డు భవానీ సింగ్, వార్డ్ బాయ్ ఉజ్వల్ దేవాసి సేవలు రద్దు చేయబడ్డాయి. ఆసుపత్రి వార్డులోకి కుక్కలు ఎలా ప్రవేశించాయో తెలుసుకునేందుకు తప్పిదంపై విచారణ జరుపుతామని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రి సిబ్బంది కూడా వార్డులో లేరని పోలీసు అధికారి తెలిపారు. "మెడికల్ బోర్డు ద్వారా పోస్ట్ మార్టం నిర్వహించబడింది. తదుపరి విచారణ తర్వాత ఈ విషయంలో కేసు నమోదు చేయబడుతుంది" ఎస్‌హెచ్‌ఓ కొత్వాలి సీతారాం తెలిపారు. మరోవైపు తన బిడ్డకు అంత్యక్రియలు నిర్వహించేలా తన భార్యకు తెలియజేయకుండా ఖాళీ కాగితాలపై ఆస్పత్రి అధికారులు సంతకం చేయించుకున్నారని చిన్నారి తండ్రి ఆరోపించాడని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై ఆసుపత్రి యాజమాన్యం కూడా విచారణ ప్రారంభించింది.
ఈ ఘటనను ఖండిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ్ పురోహిత్ మాట్లాడుతూ.. ఈ దుర్ఘటనకు ఆస్పత్రి అధికారులే బాధ్యత వహించాలన్నారు. ఇది పూర్తిగా ఆసుపత్రి పాలకవర్గం వైఫల్యమని, ఆసుపత్రిలో వీధికుక్కలు సంచరిస్తున్నాయని, ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు రాష్ట్రంలో వైద్య సదుపాయాల రూపురేఖలను మార్చేశారని ఆయన అన్నారు. భాజపా కార్యకర్తలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి నష్టపరిహారం తదితర డిమాండ్‌లతో ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు జిల్లా అధికార యంత్రాంగానికి వినతి పత్రం అందజేశారు.