కుక్కల దాడిలో బాలుడి మృతి.. సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

వీధికుక్క‌ల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మ‌రణించిన ఘ‌ట‌న‌ను తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీక‌రించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Feb 2023 9:15 AM IST
Stray Dogs Attack, High court accepted the dog attack case as suo moto,

కుక్కల దాడిలో బాలుడి మృతి.. సుమోటోగా స్వీకరించిన హైకోర్టు


వీధి కుక్కల దాడిలో హైదరాబాద్ లో నాలుగేళ్ల పిల్లాడు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అంబర్‌పేట్‌ లో వీధి కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. పేపర్ న్యూస్ ఆధారంగా కేసు విచారణకు న్యాయస్థానం స్వీకరించింది. ఓ ఇంగ్లీష్ డైలీ పేపర్ లో 'A Pack of Stray Dogs Maul A 4-Year-Old Boy to Death' వచ్చిన కథనం ఆధారంగా హైకోర్టు సుమోటోగా పరిగణించింది. ఈ కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ ఈ వార్తలోని అంశాలను పిఐఎల్‌గా స్వీకరించారు.

ప్రదీప్‌ తండ్రి గంగాధర్‌ అంబర్‌పేటలోని ఆటోమొబైల్‌ వర్క్‌షాప్‌ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వీధికుక్కల గుంపు అతడిపై దాడి చేసింది. కుక్కల బారి నుండి బయటపడేందుకు బాలుడు తన శాయశక్తులా ప్రయత్నించినట్లు ఓ వీడియో చూపిస్తుంది. అయితే కుక్కలు అతని కడుపు, ముఖం, శరీరంలోని ఇతర భాగాలపై కొరికేశాయి. ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా బాలుడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ, అదే విధంగా జీహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ ను ప్రతివాదులుగా చేరుస్తూ ఈ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.

బాలుడి తల్లిదండ్రులు సంబంధిత అంబర్‌పేట పీఎస్‌లో ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.. పోలీసులు ఫిర్యాదు నమోదు చేయలేదు. వీధి కుక్కల దాడి నుండి సాధారణ ప్రజల ప్రాణాలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చు. ఎంఏ అండ్ యూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ అంబర్‌పేట్, హైదరాబాద్ కలెక్టర్ అమోయ్ కుమార్, టీఎస్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ ఈ పిల్‌లో ప్రతివాదులుగా ఉన్నారు.

కుక్కల బెడద నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక:

జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి కుక్కల బెడదను నియంత్రించేందుకు యుద్ధప్రాతిపదికన కార్యాచరణ రూపొందించాలని ఎంఏ అండ్‌ యూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు, వెటర్నరీ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం 5,50,000 వీధికుక్కలు ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. 2011లో ఈ సంఖ్య 8,50,000 లక్షలుగా ఉంది, స్టెరిలైజేషన్ ఆపరేషన్లు నిర్వహించిన తర్వాత కుక్కల సంఖ్య భారీగా తగ్గింది. ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను అరవింద్ ఆదేశించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌ హాళ్లు, చికెన్‌ సెంటర్లు, మటన్‌ సెంటర్లు వీధుల్లో చెత్త వేయకుండా నియంత్రించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. "పాఠశాల విద్యార్థులకు కుక్కల పట్ల అవగాహన లేదు. విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన కరపత్రాలు, హోర్డింగ్‌లను కూడా సిద్ధం చేయాలి" అని అరవింద్ ఆదేశించారు. స్లమ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్లు, టౌన్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్లు, రెసిడెంట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ల సహకారంతో నియంత్రణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

వీధి కుక్కలకు సంబంధించిన ఫిర్యాదులను 'మై GHMC యాప్' లేదా డయల్ 040 - 21111111 ద్వారా నమోదు చేస్తే GHMC చర్యలు తీసుకుంటుంది. GHMC త్వరలో పెంపుడు జంతువుల నమోదు కోసం మొబైల్ యాప్‌ను సిద్ధం చేయనుంది. ఈ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రకారం సంబంధిత యజమానులకు గుర్తింపు కార్డును జారీ చేస్తుంది.

Next Story