కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరును కరోనా మహమ్మారి టెన్షన్ పెడుతోంది. ప్రతి రోజూ బెంగళూరులో భారీగా కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి. దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న జిల్లాల్లో ఒకటైన బెంగళూరు అర్బన్ జిల్లా కూడా చేరిపోయింది. దీంతో కరోనా కేసుల కట్టడికి అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు.
బెంగళూరు అర్బన్ లో 15 రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఇస్తూ కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 15 రోజుల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సురేశ్‌కుమార్ మీడియాకు తెలిపారు. కరోనా నియంత్రణకు ఏర్పాటైన సాంకేతిక సలహా సమితి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, సెలవులు ఎప్పటి నుంచి అనే విషయాన్ని శనివారం ప్రకటిస్తామన్నారు. 10వ తరగతి విద్యార్థులు తరగతులకు హాజరు కావడం తప్పనిసరి కాదన్నారు.
కేంద్ర ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం కర్ణాటకలో 34,238 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో ఆరుగురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 9,59,400 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలో గురువారం నాడు 4234 కేసులు నమోదవ్వగా.. ఒక్క బెంగళూరు అర్బన్ పరిధి లోనే 2906 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు నగరంలో కఠిన ఆంక్షలను అమలు చేయాలని అనుకుంటూ ఉన్నారు. మాస్క్ లేకుండా తిరుగుతున్న వారిపై పెద్ద ఎత్తున ఫైన్స్ విధిస్తూ ఉన్నారు.