రాజ్యాంగాన్ని మార్చాల్సిందేనని అంటున్న మరో ముఖ్యమంత్రి

Stalin calls for amending Constitution to grant more power to states. రాష్ట్రాలకు అధికారాలను తగ్గించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on  3 March 2022 11:25 AM IST
రాజ్యాంగాన్ని మార్చాల్సిందేనని అంటున్న మరో ముఖ్యమంత్రి

రాష్ట్రాలకు అధికారాలను తగ్గించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని.. రాష్ట్రాలకు మరింత అధికారాలు ఇవ్వాలని స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల అధికారాన్ని తగ్గించే దిశగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై పోరాడేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. రాష్ట్రాలకు మరింత అధికారాన్ని అందించేలా రాజ్యాంగాన్ని సవరించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. 'విభజన శక్తుల నుంచి దేశం పెద్ద ముప్పును ఎదుర్కొంటోందని అన్నారు. అలాంటి వారిని ఓడించి దేశ సమగ్రతను పరిరక్షించడానికి అందరూ కలిసి రావాలి' అని స్టాలిన్ అన్నారు. రాష్ట్రాల హక్కులను తొలగించి, శక్తిలేని ప్రాంతాలుగా మారకుండా నిరోధించడానికి మనం చేతులు కలపాలని పలు పార్టీలను స్టాలిన్ కోరారు. ఈ పోరాటంలో దేశంలోని అన్ని పార్టీలు చేతులు కలపాలని స్టాలిన్‌ పేర్కొన్నారు. లౌకిక విలువలను విశ్వసించే దేశవ్యాప్తంగా ఉన్న నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

విదేశాల్లో వైద్య విద్య అభ్యసించే విద్యార్థులను ఉద్దేశించి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలపై స్టాలిన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఉక్రెయిన్ లో ప్రస్తుతం భారత విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. ఉక్రెయిన్ లోని విద్యార్థులు సైనిక దాడులు, సరిహద్దుల వద్ద కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటుంటే, కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను నిందిస్తోంది. కేంద్రం తీరు మార్చుకోవాలని సూచించారు. విద్యార్థులను తప్పుబట్టడం మాని, వారిని క్షేమంగా తరలించడంపై దృష్టి పెట్టాలన్నారు. భారత పాస్ పోర్టు కలిగిన ప్రతి ఒక్క పౌరుడి క్షేమం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని తెలిపారు.


Next Story