స్పైస్ జెట్ పై డీజీసీఏ సీరియస్
SpiceJet Gets Government Notice On Safety. ప్రైవేటు విమానయాన సంస్ధ స్పైస్ జెట్ విమానాల్లో చోటు చేసుకుంటున్న వరుస సాంకేతిక
By Medi Samrat Published on 6 July 2022 7:45 PM IST
ప్రైవేటు విమానయాన సంస్ధ స్పైస్ జెట్ విమానాల్లో చోటు చేసుకుంటున్న వరుస సాంకేతిక సమస్యల నేపథ్యంలో డీజీసీఏ సీరియస్ అయింది. స్పైస్ జెట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. వరుస ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ 18 రోజుల్లో 8 లోపాల సంఘటనల నేపథ్యంలో స్పైస్‌జెట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. స్పైస్‌జెట్ సంస్థకు సంబంధించి గత 17 రోజుల్లో ఎనిమిది ప్రమాదాలు జరిగాయి. మంగళవారం ఒక్క రోజే మూడు సంఘటనలు జరిగాయి.
ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో ఇండికేటర్ సమస్య వల్ల కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత గుజరాత్ నుంచి వెళ్తున్న విమానం విండ్ షీల్డులో పగుళ్లు రావడంతో ఆ విమానాన్ని ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తర్వాత కోల్‌కతా నుంచి చైనా వెళ్తున్న మరో కార్గో విమానం కూడా తిరిగి వచ్చి, కోల్‌కతాలో ల్యాండ్ కావాల్సి వచ్చింది. వెదర్ రాడార్ పనిచేయకపోవడంతో ఆ విమానం తిరిగొచ్చి ల్యాండ్ అయింది. ఈ నెల 2న మరో స్పైస్‌జెట్ విమానంలో పొగలు వ్యాపించడంతో, ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఇటీవల స్పైస్‌జెట్ విమానాలకు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ఈ సంస్థకు డీజీసీఏ నోటీసులు జారీ చేసింది. ప్రమాదానికి గురవుతున్న విమానాలను, సాంకేతిక సమస్యలను గుర్తించాలంటూ యాజమాన్యాన్ని ఆదేశించింది.