ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ నుండి ముంబైకి వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం.. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో ఓ గర్భవతి కళ్లు తిరిగిపడిపోవడంతో.. ఆమెకు చికిత్స అందించేందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 182 మంది ప్రయాణికులు, సిబ్బందితో గోరఖ్‌పూర్ నుంచి ముంబైకి బయల్దేరిన స్పైస్‌జెట్ విమానం మూడు నెలల గర్భిణికి మెడికల్ ఎమర్జెన్సీ రావడంతో శనివారం మధ్యాహ్నం 12.32 గంటలకు నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసిందని ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ సునీల్ సంగోలే తెలిపారు. మహిళ ప్రయాణీకురాలిని మధ్యాహ్నం 12.42 గంటలకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
సాయంత్రం 5.17 గంటలకు విమానం ముంబైకి వెళ్లింది. నాగ్‌పూర్ ఏటీసీ, మిహన్ ఇండియా లిమిటెడ్, ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది వంటి అన్ని ఏజెన్సీలు ప్రయాణికులు, మెడికల్ ఎమర్జెన్సీని చక్కగా నిర్వహించాయని సంగోల్ చెప్పారు. ప్రయివేటు ఆసుపత్రికి చెందిన ఓ వైద్యురాలు మహిళ ప్రయాణికురాలు ప్రస్తుతం క్షేమంగా ఉందని చెప్పారు. విమానం గోరఖ్‌పూర్ నుండి బయలుదేరిన దాదాపు ఒక గంట తర్వాత, ఆమెకు తల తిరగడం, ఊపిరి ఆడకపోవడం, వాంతులు వచ్చాయి. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఆక్సిజన్ సపోర్ట్, ఇతర మందులతో ఆమెకు చికిత్స చేశారు. ఆ తర్వాత గైనకాలజిస్ట్ గర్భిణీకి చికిత్స అందించారు. నాగ్‌పూర్‌లో నివసించే బంధువుతో కలిసి మహిళ సాయంత్రం 5.20 గంటలకు ఆసుపత్రి నుంచి వెళ్లిపోయింది.