స‌డెన్‌గా ఏంటి..?.. వచ్చే నెలలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

వచ్చే నెలలో ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

By Medi Samrat  Published on  31 Aug 2023 12:19 PM GMT
స‌డెన్‌గా ఏంటి..?..  వచ్చే నెలలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

వచ్చే నెలలో ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అమృత కాల ఘడియల నేపథ్యంలో ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ ఐదు రోజుల పాటు జరిగే సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు, ప్రసంగాలు ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశాల్లో ఐదు సిట్టింగ్స్ ఉంటాయని.. అమృత కాలంలో పార్లమెంటులో సత్ఫలితాలిచ్చే చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు ఆకాంక్షించారు. మొత్తం ఐదు రోజులు జరగనున్న ఈ సమావేశాలు సెప్టెంబరు 22న ముగుస్తాయని ప్రహ్లాద్ జోషి తెలిపారు.

ఈ ప్రత్యేక సమావేశాల్లో 10కి పైగా ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇటీవలే ముగిశాయి. జూలై 20వ తేదీన ప్రారంభమై ఆగస్ట్ 11వ తేదీ వరకు జరిగాయి. మణిపూర్ అంశంపై పార్లమెంట్ దద్దరిల్లింది. విపక్షాల అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. 23 రోజుల పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం 23 బిల్లులను లోక్ సభ, రాజ్యసభ ఆమోదించాయి.

Next Story