మీడియా రంగంలో కీలక విలీన ప్రకటన

Sony Pictures India To Buy Zee Entertainment. భారతదేశంలోని ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat  Published on  22 Sept 2021 7:44 PM IST
మీడియా రంగంలో కీలక విలీన ప్రకటన

భారతదేశంలోని ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో తమ సంస్థను విలీనం చేయాలని జీ కంపెనీ ప్రతినిధులు నిర్ణయించారు. బుధవారం జరిగిన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సమాచారం. జీ కంపెనీ సీఈవోగా ఉన్న పునీత్ గోయెంకా ఈ ఒప్పందం తర్వాత మరో ఐదేళ్లు ఎండీ, సీఈవోగా కొనసాగనున్నారు. ఈ ఒప్పందం ప్రకారం సోనీ సంస్థ 1.57 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. విలీనం తర్వాత కంపెనీలో అధిక శాతం డైరెక్టర్లను సోనీ కంపెనీనే నామినేట్ చేస్తుంది. విలీనం తర్వాత జీ వద్ద 47.07 శాతం, సోనీ వద్ద 52.93 శాతం వాటాలు ఉంటాయి. 90 రోజుల్లో ఈ విలీనంపై ఒప్పందం జరగనుంది. జీ సంస్థ మంచి ఎదుగుదల చూపిస్తోందని, ఈ విలీనం వల్ల కంపెనీకి మరింత లబ్ధి చేకూరుతుందని బోర్డు భావిస్తోందని సంస్థ చైర్మన్ ఆర్. గోపాలన్ తెలిపారు. ఈ విలీనం వల్ల బిజినెస్ అభివృద్ధి జరుగుతుందని, అలాగే షేర్‌హోల్డర్లకు కూడా లాభదాయకంగా ఉంటుందని ఆయన అన్నారు. జీ కంపెనీ షేర్ హోల్డర్ల ఆమోదం కోసం త్వరలోనే ఈ ప్రతిపాదనను ప్రవేశపెడతామని వివరించారు.

'జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌(జెడ్‌ఈఈఎల్‌)', 'సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా(ఎస్‌పీఎన్‌ఐ)' మధ్య విలీనానికి జీ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సంస్థ వెల్లడించింది. ఒప్పందం ప్రకారం.. విలీనం తర్వాత ఏర్పడే సంస్థలో సోనీ పిక్చర్స్‌ 1.575 బిలియన్‌ డాలర్ల నిధుల్ని పెట్టుబడిగా పెట్టనుంది. ఆర్థికపరమైన అంశాలే కాకుండా సోనీతో భాగస్వామ్యం వల్ల రానున్న వ్యూహాత్మక విలువను కూడా పరిగణనలోకి తీసుకున్నామని జీ బోర్డు తెలిపింది. దక్షిణాసియాలో ప్రధాన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీగా నిలబెట్టేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని తెలిపింది. కంపెనీ వాటాదార్లకూ ఇది లాభదాయకమని వెల్లడించింది. ఇకపై ఇరు కంపెనీలు లీనియర్‌ నెట్‌వర్క్స్‌, డిజిటల్‌ అసెట్స్‌, ప్రొడక్షన్‌ ఆపరేషన్స్‌, ప్రోగ్రాం లైబ్రరీస్‌ వంటి వ్యవహారాలను పంచుకోనున్నాయి. ఇక ఒప్పంద అమలుకు ముందు చేయాల్సిన ప్రక్రియను పూర్తిచేయడానికి 90 రోజుల గడువు నిర్దేశించారు. ఈ సమయంలో జీ ప్రమోటర్ల కుటుంబం 4 శాతంగా ఉన్న తమ ప్రస్తుత వాటాల్ని 20 శాతానికి పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారు.


Next Story