అగ్నిపథ్ పై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

Sonia Gandhi's Appeal To Protesters From Hospital. కేంద్రం కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిప‌థ్ స్కీమ్‌కు దిశ‌లేద‌ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

By Medi Samrat  Published on  18 Jun 2022 1:45 PM GMT
అగ్నిపథ్ పై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

కేంద్రం కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిప‌థ్ స్కీమ్‌కు దిశ‌లేద‌ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. యువ‌త స్వ‌రాన్ని ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆమె ఓ ప్రకటన ద్వారా చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. దేశ‌వ్యాప్తంగా ఆ స్కీమ్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆమె స్పందించారు. ఆర్మీ ఉద్యోగం ప్ర‌య‌త్నిస్తున్న యువ‌త శాంతియుతంగా, అహింసా ప‌ద్ధ‌తిలో త‌మ డిమాండ్ల కోసం పోరాటం చేయాల‌ని సోనియా కోరారు. నిర‌స‌న చేప‌డుతున్న యువ‌త‌కు మ‌ద్దుతుగా కాంగ్రెస్ పార్టీ ఉంద‌ని, అగ్నిప‌థ్ స్కీమ్‌ను ర‌ద్దు చేసే వర‌కు పోరాటం కొన‌సాగిస్తామ‌ని సోనియా అన్నారు. ప్రభుత్వం మీ మాటలను విస్మరించి, ఏ దిశ లేని కొత్త సైనిక రిక్రూట్‌మెంట్ స్కీమ్ ని ప్రకటించినందుకు నేను నిరాశ చెందాను. చాలా మంది మాజీ సైనికులు కూడా కొత్త పథకంపై ప్రశ్నలు లేవనెత్తారని ఆమె చెప్పుకొచ్చారు.

అగ్నిపథ్‌పై రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. అగ్నిపథ్‌ ప‌థ‌కాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు. గత ఎనిమిదేళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం 'జై జవాన్‌, జై కిసాన్‌' విలువలను అవమానపరిచింది. సాగు చట్టాలను ప్రధానమంత్రి రద్దు చేసుకోకతప్పదని నేను గతంలో చెప్పాను. అదే తరహాలో తాజాగా ఆయన దేశ యువత నిర్ణయాన్నీ అంగీకరించాల్సిందే. క్షమాపణలు చెప్పి అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాల్సిందే అని పోస్టులో పేర్కొన్నారు. రైతుల సుదీర్ఘ నిరసనల అనంతరం సాగు చట్టాలను ఎలా రద్దు చేశారో.. అలాగే సైనికుల నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని సైతం వెనక్కి తీసుకోక తప్పదని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.










Next Story