రాహుల్, ప్రియాంక తోడుగా విదేశాలకు సోనియా గాంధీ
Sonia Gandhi to travel abroad for medical checkup with Rahul and Priyanka.వైద్య పరీక్షల కోసం సోనియా గాంధీ విదేశాలకు వెళ్లనున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 24 Aug 2022 12:21 PM ISTవైద్య పరీక్షల కోసం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విదేశాలకు వెళ్లనున్నారు. ఆమెకు తోడుగా కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీలు కూడా వెళతారని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేశ్ తెలిపారు. అయితే.. వారి పర్యటనకు సంబంధించిన తేదీలను వెల్లడించలేదు. ఢిల్లీలో 'మెహంగై పర్ హల్లా బోల్' ర్యాలీ నిర్వహించేలోగా రాహుల్ గాంధీ తిరిగి వస్తారని మాత్రం చెప్పారు. సెప్టెంబర్ 4న రాహుల్ ప్రసంగిస్తారని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పోరుకు సిద్దం అవుతోంది. దేశంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను దీనికి ప్రధాన అస్త్రంగా చేసుకోనుంది. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, ఆహార వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడం వల్ల సామాన్యులు పడుతోన్న ఇబ్బందులు, రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖలను ప్రయోగిస్తోండటం వంటి వాటికి నిరసనగా 'భారత్ జోడో' యాత్రను మొదలు పెట్టనుంది. భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభంకానుంది.
మరోవైపు అంతర్గత సమస్యలతో కాంగ్రెస్ పార్టీ సతమతం అవుతోంది. ఒక్కొక్కరుగా ఆ పార్టీ సీనియర్ నేతలు షాకిస్తున్నారు. ఇప్పటికే గులాం నబీ ఆజాద్ పార్టీలోని తన పదవులకు రాజీనామ చేయగా.. అదే దారిలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కీలక నేతగా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆనంద్ శర్మ, హిమాచల్ ప్రదేశ్ పార్టీ స్టీరింగ్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ ఏడాది చివర్లో హిమాచల్ లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఇది ఆ పార్టీకి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.