కాంగ్రెస్ పార్టీలో భారీగా మార్పులు రాబోతున్నాయా..?

Sonia Gandhi To Congress On Poll Results. కాంగ్రెస్ పార్టీ.. ఏ రాష్ట్ర ఎన్నికల్లో అడుగుపెట్టినా కూడా ఓటమి పలకరిస్తూనే ఉంది. గత మూడేళ్ళుగా

By Medi Samrat  Published on  10 May 2021 1:39 PM GMT
కాంగ్రెస్ పార్టీలో భారీగా మార్పులు రాబోతున్నాయా..?

కాంగ్రెస్ పార్టీ.. ఏ రాష్ట్ర ఎన్నికల్లో అడుగుపెట్టినా కూడా ఓటమి పలకరిస్తూనే ఉంది. గత మూడేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలాగే నెలకొంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల ఫలితాలలో కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు బెడిసికొట్టాయి. ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో తాజాగా ఈ ఫలితాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇంటిని చక్కబెట్టాల్సిన సమయమొచ్చిందని, వరుస ఓటములను పార్టీ నేతలు తీవ్రంగా పరిగణించాలని అన్నారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితేంటో ఆయా రాష్ట్రాల్లోని పార్టీ సీనియర్ నేతలు నిక్కచ్చిగా చెప్పాలని.. వస్తాయని అనుకున్న దాని కన్నా తక్కువ సీట్లు ఎందుకు వచ్చాయో వివరణ ఇవ్వాలని అన్నారు. అంతేకాకుండా ఓ చిన్న కమిటీని వేస్తున్నట్టు చెప్పారు. ఓటములకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ ఆ కమిటీ పార్టీకి తెలియజేస్తుందని.. కాంగ్రెస్ అంతర్గత ఎన్నికలపైనా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 23న ఎన్నికలు నిర్వహించనున్నట్టు సమాచారం. ఎన్నిక ద్వారానే పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయగా.. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉంది. బాధ్యతలు చేపట్టాల్సిందిగా రాహుల్ ను పార్టీ నేతలు పలుమార్లు బతిమాలినా ప్రయోజనం లేదు. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతూ ఉన్నారు. ఫిబ్రవరిలోనే జరగాల్సిన పార్టీ అధ్యక్ష ఎన్నికలను.. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీడబ్ల్యూసీ వాయిదా వేసింది. సరైన నాయకత్వం లేకుండా పోవడం కూడా కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములకు ఓ కారణమనే చెబుతున్నారు.
Next Story
Share it