ఈడీ విచారణకు హాజరైన సోనియా గాంధీ
Sonia Gandhi to appear before ED by 11 am today. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి దర్యాప్తులో పాల్గొనాల్సిందిగా
By Medi Samrat
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి దర్యాప్తులో పాల్గొనాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు అందుకున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సోనియా వెంట ఆమె తనయ ప్రియాంక గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆమె వెంట ఉండేందుకు ఈడీ అనుమతినిచ్చినట్లు సమాచారం. ఒక మహిళతో సహా జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి బృందం ఆమెను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు రాహుల్ గాంధీని అడిగిన ప్రశ్నలనే ఆమెను కూడా అడగాలని ఈడీ వర్గాలు అంతకుముందే సూచించాయి.
జూన్ 23న జరగాల్సిన సోనియా విచారణ.. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆమె అభ్యర్థన మేరకు వాయిదా వేశారు. యంగ్ ఇండియా (వైఐ), అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (ఎజెఎల్) మధ్య డీల్‌లో ఆమె పాత్ర గురించి ఈడీ సోనియా గాంధీని ప్రశ్నించనుంది. ఈ వ్యవహారాలన్నీ దివంగత మోతీలాల్ వోరా చూస్తున్నారని రాహుల్ గతంలో అన్నారు. యంగ్ ఇండియాలో వోరా 12 శాతం వాటాలను కలిగి ఉండగా.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ 76 శాతం వాటాలను కలిగి ఉన్నారు. ఈడీ ప్రకారం.. మొత్తం ఒప్పందంలో గాంధీలు ప్రధాన లబ్ధిదారులు. అంతకుముందు పవన్ బన్సాల్, మల్లికార్జున ఖర్గేలను ఈడీ ప్రశ్నించింది.
ఇదిలావుంటే.. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమన్లు జారీ చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, పలువురు పార్టీ కార్యకర్తలతో కలిసి ఈడీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ కార్యకర్తల నిరసన ప్రదర్శనలను అడ్డుకునేందుకు పోలీసులు ఆయా రాష్ట్రాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.