'గ్రోక్'తో అభ్యంతరకర కంటెంట్..ఎక్స్ నివేదికపై కేంద్రం అసంతృప్తి

గ్రోక్ 'ఏఐ' వేదికలో అసభ్యకర, అశ్లీల కంటెంట్‌ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై ఎక్స్ తన నివేదికను సమర్పించింది.

By -  Knakam Karthik
Published on : 8 Jan 2026 10:40 AM IST

National news, Delhi, Central Government, Social media platform X, Grok

'గ్రోక్'తో అభ్యంతరకర కంటెంట్..ఎక్స్ నివేదికపై కేంద్రం అసంతృప్తి

ఢిల్లీ: గ్రోక్ 'ఏఐ' వేదికలో అసభ్యకర, అశ్లీల కంటెంట్‌ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై ఎక్స్ తన నివేదికను సమర్పించింది. 'గ్రోక్‌కు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన గడువు బుధవారం సాయంత్రంతో ముగిసింది. దీంతో గడువులోగా నివేదికను సమర్పించింది. 'ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లోని గ్రోక్ ద్వారా మహిళల అభ్యంతరకరమైన చిత్రాలను అనుమతి లేకుండా రూపొందించిన, అశ్లీల కంటెంట్ కార్యకలాపాల్లో పాల్గొన్న ఖాతాలను శాశ్వతంగా నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఐటీ మంత్రిత్వ శాఖకు ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్ తెలిపింది.

అయితే, ఈ సమస్యకు గల కారణాలపై ఎలాంటి సాంకేతిక వివరణ లేకపోవడం, గ్రోక్ అలాంటి చిత్రాలను రూపొందించకుండా నిరోధించే చర్యలు ఈ నివేదికలో లేకపోవడంతో కేంద్రం సంతృప్తిగా లేదని తెలుస్తోంది. తదుపరి చర్యలపై కేంద్రం సమాలోచన చేస్తోందని సమాచారం. ఎక్స్‌లో అసభ్యకర కంటెంట్‌కు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై ఆయా సామాజిక మాధ్యమ వేదికలదే బాధ్యత అని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది.

స్థానిక ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ రూపొందించిన, వ్యాప్తి చేసిన కంటెంట్ మొత్తాన్ని తక్షణమే తొలగించాలని పేర్కొంటూ జనవరి 2న 'ఎక్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరకర కంటెంట్, యూజర్లు, అకౌంట్ల పైనా చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యలకు సంబంధించి 72 గంటల్లో నివేదిక అందజేయాలని ఆదేశించింది. కేంద్రం చర్యల నేపథ్యంలో ఎక్స్‌ ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. చట్టవిరుద్ధ కంటెంట్ రూపొందించేందుకు గ్రోక్‌ను ఉపయోగించే వారు తదుపరి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Next Story