నిరాహార దీక్ష వద్దనుకున్న అన్నా హజారే

Social Activist Anna Hazare Cancels Fast Over Farm Reforms. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే వ్యవసాయ చట్టాలకు

By Medi Samrat  Published on  30 Jan 2021 3:30 PM IST
నిరాహార దీక్ష వద్దనుకున్న అన్నా హజారే
ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా నిరవధిక నిరాహారదీక్ష చేయాలనే ఆలోచన విరమించుకున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అనంతరం ఆయన సమక్షంలోనే అన్నా హజారే ఈ ప్రకటన చేశారు. కనీస మద్దతు ధరను 50 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తనకు లేఖ అందిందని, తాను ప్రతిపాదించిన 15 డిమాండ్ల పరిష్కారానికి కృషి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండడంతో నిరాహార దీక్ష ఆలోచనను విరమించుకుంటున్నట్టు 84సంవత్సరాల హజారే తెలిపారు. 2018లో ఢిల్లీలో తాను ఢిల్లీలో దీక్ష చేపట్టానని... సమస్యలను పరిష్కరిస్తామని అప్పుడు కేంద్రం తనకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిందని హజారే తెలిపారు. కానీ, ఇంత వరకు ఎలాంటి చర్యలు లేవని ఈ మధ్యనే చెప్పుకొచ్చారు.


అన్నా హజారే ఇటీవల మాట్లాడుతూ ఈ నెల 30 నుంచి రైతు సమస్యల పరిష్కారం కోసం మహారాష్ట్రలోని తన సొంత పట్టణమైన రాలేగావ్ సిద్ధిలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. తన మద్దతుదారులందరూ వారివారి ప్రదేశాల్లోనే నిరసన కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. అయితే ఈ నిర్ణయాన్ని ఆయన విరమించుకున్నారు.

గత నాలుగేళ్లుగా రైతుల సమస్యలపై తాను పోరాడుతున్నానని.. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు. గత మూడు నెలల్లో ప్రధాని మోదీకి, కేంద్ర వ్యవసాయ మంత్రికి తాను ఐదు సార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయిందని హజారే ఆవేదన వ్యక్తం చేశారు.


Next Story