కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముగ్గురు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసు పంపారు. పవన్ ఖేరా, జైరాం రమేష్, నెట్టా డిసౌజా లకు లీగల్ నోటీసులు పంపారు. 'పరువు తీయడం, పరువు నష్టం కలిగించే ఉద్దేశ్యంతో వరుస ద్వేషపూరిత, వ్యక్తిగత దాడులకు కుట్ర పన్నినందుకు' ఆమె కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపారు. ఇరానీ కుమార్తె జోయిష్ గోవాలో 'నకిలీ లైసెన్స్'తో బార్, రెస్టారెంట్ నడుపుతోందని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా మీడియాతో అన్నారు. 13 నెలల క్రితం మరణించిన వ్యక్తి పేరిట స్మృతి ఇరానీ కుమార్తె లైసెన్స్ పొందిందని ఖేరా అవినీతి ఆరోపణలు చేశారు.
విలేకరుల సమావేశంలో ఇరానీ ఆరోపణలను తిప్పికొట్టారు. తన కూతురు చట్ట విరుద్ధంగా బార్ నడుపుతోందన్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. 18 ఏళ్ల వయసున్న ఒక ఆడపిల్లపై, ఒక కళాశాల విద్యార్థినిపై ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఆమెపై కాంగ్రెస్ నేతలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తప్పల్లా తన తల్లి రాహుల్ గాంధీపై 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీగా నిలబడటమే అని స్మృతి అన్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె గోవాలో అక్రమ బార్‌ను నడుపుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. వెంటనే ప్రధాని మోదీ స్పందించి స్మృతి ఇరానీని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ శనివారం డిమాండ్ చేస్తోంది.