కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఆమె కుమార్తె జోయిష్‌లు గోవా రెస్టారెంట్ యజమానులు కాదని ఢిల్లీ హైకోర్టు సోమవారం నాడు తెలిపింది. వారికి అనుకూలంగా ఎలాంటి లైసెన్స్ జారీ చేయలేదని కోర్టు పేర్కొంది. గోవాలో మంత్రి కుమార్తె అక్రమంగా బార్ నడుపుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. వారిపై స్మృతి ఇరానీ పరువునష్టం దావా వేసిన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. "స్మృతి ఇరానీ ఆమె కుమార్తె రెస్టారెంట్ యజమానులు కాదు. స్మృతి ఇరానీ లేదా ఆమె కుమార్తె లైసెన్స్ కోసం ఎప్పుడూ దరఖాస్తు చేయలేదు" అని కోర్టు పేర్కొంది. "రెస్టారెంట్ లేదా భూమి స్మృతి ఇరానీ ఆమె కుమార్తె స్వంతం కాదు" అని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.
స్మృతి ఇరానీ కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా, జైరాం రమేష్, నెట్టా డిసౌజాకు పరువు నష్టం నోటీసులు పంపారు. ఈ ఆరోపణలకు కాంగ్రెస్ నాయకులు క్షమాపణలు చెప్పాలని స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. స్మృతి ఇరానీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో జై రాం రమేశ్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజాలకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఈ ముగ్గురు నేతలు తనపై, తన కుమార్తెపై నిరాధార ఆరోపణలు చేశారంటూ స్మృతి ఇరానీ రూ.2 కోట్లకు పైగా నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సివిల్ పరువునష్టం దావా వేశారు.
స్మృతి కూతురు 18 ఏళ్ల జోయిష్ ఇరానీ గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే ఇరానీని మంత్రి వర్గం నుంచి తొలగించాలని జైరాం డిమాండ్ చేశారు. ఇరానీ కూతురు గోవాలో రెస్టారెంట్ నడుపుతోందని, అందులో నకిలీ లైసెన్స్ తో బార్ నడుస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మీడియాకు తెలిపారు.