మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్యాంకర్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఈ ఘటన ముంబై-ఆగ్రా జాతీయ రహదారిపై జరిగింది. లావాడియా పోలీస్ స్టేషన్ పరిధిలోని తలవాలిచందా వద్ద సోమవారం అర్ధరాతి 2 గంటలకు ప్రాంతంలో పెట్రోల్ బంక్ ముందు ఆగి ఉన్న.. ఖాళీ పెట్రోల్ ట్యాంకర్‌ను దేవాస్ నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిదిమందిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు చికిత్సకు తరలిస్తుండగా మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
మృతిచెందిన వారిని విద్యార్థులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వీరంతా మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. పెట్రోల్ ట్యాంకర్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్టు పేర్కొన్నారు. కారులో మృతదేహాలు ఇరుక్కుపోవడంతో వాటిని బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సివచ్చింది. అనంతరం మృతదేహాలను ఎంవై హాస్పిటల్‌కు తరలించారు.