32 ఏళ్ల తర్వాత 100 మందికి పైగా బాలికలకు న్యాయం.. లైంగిక వేధింపుల కేసులో ఆరుగురికి జీవిత ఖైదు
అజ్మీర్ గ్యాంగ్ రేప్, బ్లాక్ మెయిల్ కేసులో ఆరుగురు నిందితులకు ప్రత్యేక పోక్సో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది
By Medi Samrat Published on 20 Aug 2024 5:52 PM ISTఅజ్మీర్ గ్యాంగ్ రేప్, బ్లాక్ మెయిల్ కేసులో మిగిలిన ఆరుగురు నిందితులకు ప్రత్యేక పోక్సో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున జరిమానా కూడా విధించింది. అంతకుముందు కోర్టు తన నిర్ణయంలో నిందితులు నఫీస్ చిస్తీ, నసీమ్ అలియాస్ టార్జాన్, సలీం చిస్తీ, సోహిల్ ఘని, సయ్యద్ జమీర్ హుస్సేన్, ఇక్బాల్ భాటిలను దోషులుగా నిర్ధారించింది. 1992లో 100 మందికి పైగా పాఠశాల, కళాశాల బాలికలపై సామూహిక అత్యాచారం, బ్లాక్ మెయిల్ చేసిన కేసులో 18 మంది నిందితులుగా ఉన్నారు. 9 మందికి శిక్ష పడింది. ఒక నిందితుడు మరో కేసులో జైలులో ఉన్నాడు. ఒకరు ఆత్మహత్య చేసుకోగా.. ఒకరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మిగిలిన 6 మందిపై ఈరోజు నిర్ణయం వెలువడింది.
1992లో కాలేజీకి వెళ్లే అమ్మాయిల నగ్న చిత్రాలు నగరంలో హల్ చల్ చేశాయి. ఈ కేసులో 18 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో నలుగురు నిందితులు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా ప్రకటించింది. 2003లో నలుగురి శిక్షను యావజ్జీవ కారాగార శిక్ష నుండి 10 సంవత్సరాలకు తగ్గించింది. నిందితులు ఇప్పటికే 10 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించి జైలు నుండి విడుదలయ్యారు.
అజ్మీర్‌లో అప్పటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫరూఖ్ చిస్తీతో అతడి స్నేహితులు.. ఫామ్‌హౌస్‌లు, రెస్టారెంట్లలో పార్టీల పేరుతో అమ్మాయిలను పిలిచి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసేవారు. ఆ తర్వాత అమ్మాయిల నగ్న చిత్రాలు తీసేవారు. నిందితులు అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తూ తమతో పాటు వేరే అమ్మాయిలను తీసుకురావాలని ఒత్తిడి చేసేవారు.
నిందితులకు వ్యతిరేకంగా కొంతమంది అమ్మాయిలు మాత్రమే ఫిర్యాదు చేసేందుకు ధైర్యం చేశారు. అయితే అప్పట్లో పోలీసులు కూడా ఈ విషయంపై చర్యలు తీసుకోవడంలో వెనుకాడారు. కొందరు బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారికి బెదిరింపులు మొదలయ్యాయి. అయితే 18 మంది బాధితులు మాత్రం కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.