అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికింగ్ సిండికేట్‌లో ఆర్యన్ ఖాన్ భాగమని నిరూపితమయ్యేలా ఎటువంటి ఆధారాలు లభించలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో తేలినట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ విచారణలో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు సిట్ వెల్లడించింది. ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని.. దీంతో అతడి ఫోన్ సరెండర్ చేయాల్సిన అవసరం లేదని సిట్ అధికారులు తేల్చినట్లు తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అక్టోబర్ 3న ఓ విహారయాత్రలో రైడ్ చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
మాదక ద్రవ్యాల కేసులో అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాతో పాటు మరో 17 మందిని కూడా అరెస్టు చేశారు. 20 రోజుల జైలు జీవితం తర్వాత ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరైన తర్వాత.. ఆర్యన్ ఖాన్ ప్రతి శుక్రవారం ఎన్‌సీబీ కార్యాలయంలో హాజరవాలని ఆదేశించింది. ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన.. ఎన్‌సిబికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆర్యన్ ఖాన్ కేసును స్వాధీనం చేసుకుంది. ఆ బృందం అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికింగ్ సిండికేట్‌తో ఆర్యన్ ఖాన్‌కు ఉన్న సంబంధాన్ని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని ప్రకటించింది.