2024లో రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు : సిద్ధరామయ్య

Siddaramaiah's PM hope for Rahul Gandhi in 2024 after Karnataka mandate. కర్ణాటకలో కాంగ్రెస్‌కు మెజారిటీ రావడం పెద్ద విజయం అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య పేర్కొన్నారు

By Medi Samrat  Published on  13 May 2023 3:15 PM GMT
2024లో రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు : సిద్ధరామయ్య

కర్ణాటకలో కాంగ్రెస్‌కు మెజారిటీ రావడం పెద్ద విజయం అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య పేర్కొన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయానికి పునాది వేస్తాయని ఆయన అన్నారు. అదే సమయంలో 2024లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై బీజేపీని లక్ష్యంగా చేసుకున్న సిద్ధరామయ్య.. ఈ ఫలితాలు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా వచ్చిన ఆదేశమని అన్నారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఇవి ముఖ్యమైన ఎన్నికలని ఆయన అన్నారు. ఈ ఎన్నిక ఫలితం 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మైలురాయి. 2024లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని.. రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

కర్ణాటకలోని వరుణ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య బీజేపీ మంత్రి వీ సోమన్నపై విజయం సాధించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు 100 శాతం ఖచ్చితంగా నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు వ్యతిరేకంగా వచ్చిన ఆదేశమని అన్నారు. రాష్ట్రంలో ద్వేషం, మత రాజకీయాలు నడుస్తున్నాయని సిద్ధరామయ్య అన్నారు. దీన్ని కర్ణాటక ప్రజలు సహించలేదు. ధన బలంతో ఈ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ప్రయత్నించిందని, కానీ అవి సఫలం కాలేదన్నారు. కర్ణాటకలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ బిజెపి ప్రభుత్వంతో విసిగిపోయారు. అధికార మ‌ర్పు కోరుకున్నార‌ని అన్నారు.


Next Story