శ్రద్ధా వాకర్‌ హత్యపై సీబీఐ దర్యాప్తు కోరుతూ పిల్.. న్యాయవాదికి జరిమానా..

Shraddha Walker Murder Case. శ్రద్ధా వాకర్‌ హత్యపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఒక న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు.

By Medi Samrat  Published on  2 Dec 2022 9:15 PM IST
శ్రద్ధా వాకర్‌ హత్యపై సీబీఐ దర్యాప్తు కోరుతూ పిల్.. న్యాయవాదికి జరిమానా..

శ్రద్ధా వాకర్‌ హత్యపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఒక న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఆయనను మందలించడంతోపాటు రూ.10,000 జరిమానా కూడా విధించింది. సహజీవనం చేస్తున్న ప్రియురాలు శ్రద్దా వాకర్‌ను ఆమె ప్రియుడు ఆఫ్తాబ్‌ పూనావాలా ఈ ఏడాది మే నెలలో దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికాడు. ఫ్రిజ్‌లో దాచిన శరీర భాగాలను పలు ప్రాంతాల్లో పడేశాడు. నిందితుడు ఆఫ్తాబ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఈ దారుణం గురించి అతడే బయటపెట్టిన సంగతి తెలిసిందే. అఫ్తాబ్ పూనావాలా నార్కో అనాలిసిస్ పరీక్షలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు కూడా. శ్రద్ధాను తానే చంపానని అంగీకరించిన అఫ్తాబ్.. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని ఎక్కడ దాచి పెట్టిందీ వెల్లడించాడు. శ్రద్ధను చంపినప్పుడు ఆమె ఎలాంటి దుస్తులు ధరించి ఉన్నదీ చెప్పడంతోపాటు ఆమె వద్దనున్న ఫోన్ వివరాలను కూడా వెల్లడించినట్టు తెలుస్తోంది. నార్కో పరీక్షల సమయంలో సైకాలజిస్ట్, ఫొటో ఎక్స్‌పర్ట్, అంబేద్కర్ ఆసుపత్రి వైద్యులు ఉన్నట్టు ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ సంజీవ్ గుప్తా తెలిపారు. అఫ్తాబ్‌కు నిర్వహించిన నార్కో టెస్టు విజయవంతమైందని అధికారులు తెలిపారు.

శ్రద్ధా వాకర్‌ హత్యపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఒక న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ హత్య కేసును ఢిల్లీ పోలీసులు సరిగా దర్యాప్తు చేయడం లేదని ఆరోపించారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం, నవంబర్‌ 22న ఈ పిల్‌ను తిరస్కరించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)ను దుర్వినియోగం చేయడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్లిసిటీ కోసం వక్ర ఉద్దేశాలతో వీటిని దాఖలు చేస్తున్నారని.. ఈ పిల్‌ దాఖలు చేసిన న్యాయవాదికి రూ.10,000 జరిమానా విధించింది.


Next Story