2016లో 1000, 500 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 1000 నోటు స్థానంలో అప్పట్లో రూ.2 వేల నోటును తీసుకురాగా, పాత రూ.500 నోటు స్థానంలో కొత్తది ప్రవేశపెట్టింది. తాజాగా 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆర్.బీ.ఐ. గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ వెయ్యి రూపాయల నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 2 వేల నోట్లను విత్ డ్రా చేసుకున్న నేపథ్యంలో ఆ ప్రభావాన్ని తట్టుకునేందుకు రూ.వెయ్యి నోట్లను ప్రవేశపెడుతారా? అని మీడియా ప్రశ్నించింది. ఆయన బదులిస్తూ.. రూ.1000 నోటును మళ్లీ తీసుకోచ్చే ఆలోచన లేదు. అది ఊహాజనితమే. మా వద్ద అలాంటి ప్రతిపాదనేదీ లేదని వివరించారు. ప్రస్తుతం సర్క్యులేషన్‌లో ఉన్న కరెన్సీలో కేవలం 10.8 శాతం మాత్రమే రూ.2 వేల నోట్లు ఉన్నాయని శక్తికాంతదాస్ వివరించారు.
శక్తికాంత దాస్ మాట్లాడుతూ రూ. 2000 నోటు చట్టబద్ధంగా కొనసాగుతుందని, దుకాణాలు వాటిని తిరస్కరించకూడదని అన్నారు. "మేము రూ. 2000 నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నాము, అయితే అవి చట్టబద్ధమైన కరెన్సీగా కొనసాగుతాయి" అని దాస్ చెప్పారు. గతంలో సెంట్రల్ బ్యాంక్ నిర్దేశించిన విధంగా రూ. 2,000 నోట్లను ఎవరూ తిరస్కరించకూడదని తెలిపారు.