గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులు..కాంగ్రెస్ కార్యకర్త మృతి

కర్ణాటక బళ్లారిలో BJP MLA గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులు కలకలం రేపాయి.

By -  Knakam Karthik
Published on : 2 Jan 2026 10:50 AM IST

National News, Karnataka, Bangalore, Gali Janardhan Reddy, Nara Bharat Reddy, Bellary, Congress, political violence

గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులు..కాంగ్రెస్ కార్యకర్త మృతి

కర్ణాటక బళ్లారిలో BJP MLA గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులు కలకలం రేపాయి. ఆయన ఇంటి ముందు కాంగ్రెస్ MLA భరత్ రెడ్డి అనుచరులు నిన్న సాయంత్రం బ్యానర్ కట్టేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ మొదలైంది. ఇరువర్గాలు పరస్పరం కాల్పులు జరపగా ఓ కాంగ్రెస్ కార్యకర్త మరణించాడు. తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని జనార్దన్ ఆరోపించగా భరత్ ఖండించారు. తమ కార్యకర్త చావుకు కారణమైన జనార్దన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

బళ్లారి నగరంలో జనవరి 3న వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక బ్యానర్‌ను బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మద్దతుదారులు, హవాంబవి ప్రాంతంలోని గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. దీనిని జనార్దన్ రెడ్డి అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇరువర్గాల మధ్య మొదలైన వాగ్వాదం కాస్తా రాళ్ల దాడికి, ఆపై కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త, బళ్లారి హుస్సేన్ నగర్ నివాసి అయిన రాజశేఖర్ (28) అక్కడికక్కడే మృతి చెందారు.

ఘటన అనంతరం ఇరు వర్గాలు పెద్ద ఎత్తున గుమిగూడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి, ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేయడంతో పాటు బాష్పవాయువును ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తాము కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించి, భారీగా పోలీసులను మోహరించారు. ఘటన జరిగిన రోజే బళ్లారి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పవన్ నెజ్జూర్ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Next Story