ఉత్తరప్రదేశ్ లో ఓ బీజేపీ ఎమ్మెల్యే షూస్ కొట్టేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఫతేహాబాద్ శాసనసభ్యుడు ఛోటేలాల్ వర్మ ఆగ్రాలో సతీమాత ఉత్సవాలను ప్రారంభించేందుకు ఆలయం వద్దకు వెళ్లారు. దైవ దర్శనం కోసం ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి తిరిగొచ్చేలోపు ఎమ్మెల్యే బూట్లను దొంగలు కొట్టేశారు. ఎమ్మెల్యే బూట్లు కనిపించకపోవడంతో పోలీసులు, అధికారులు చుట్టుపక్కల చూసినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో చేసేదిలేక ఎమ్మెల్యే ఛోటేలాల్ వర్మ తన కారు వరకు ఉత్త కాళ్లతోనే నడిచి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఎమ్మెల్యే ఆలయం వెలుపల తన పాదరక్షలు తీసివేసి, ప్రార్థనలు చేయడానికి ఆలయ గర్భగుడిలోకి వెళ్ళాడు. గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి వెళ్లేందుకు పాదరక్షలు ధరించాలనుకున్నా అక్కడ బూట్లు కనిపించలేదు. కార్యకర్తలు, నిర్వాహకులు బూట్ల కోసం అక్కడక్కడ చాలాసేపు వెతికినా బూట్లు కనిపించలేదు. ఎమ్మెల్యే పాదరక్షలు లేకుండా తిరిగి వెళ్లాల్సి వచ్చింది. గ్రామంలోని సతీదేవి ఆలయంలో రెండు రోజులపాటు నిర్వహించే జాతరను గురువారం ప్రారంభించేందుకు ఎమ్మెల్యే ఛోటేలాల్ వర్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజేంద్రసింగ్ తో కలిసి వెళ్లారు.