శీష్ మహల్ పునర్నిర్మాణం వివాదం..విచారణకు కేంద్రప్రభుత్వం ఆదేశం
శీష్ మహల్ పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik
శీష్ మహల్ పునర్నిర్మాణం వివాదం..విచారణకు కేంద్రప్రభుత్వం ఆదేశం
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని పునర్నిర్మించడంలో జరిగిన అవకతవకలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ వివరణాత్మక దర్యాప్తును ఆదేశించింది. శీష్ మహల్ పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేంద్ర ప్రజా పనుల విభాగం వాస్తవ నివేదికను సమర్పించిన నేపథ్యంలో ఫిబ్రవరి 13న ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో 6 ఫ్లాగ్దాఫ్ బంగ్లాను పునరుద్ధరణకు ఆప్ ప్రభుత్వం భవన నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై విచారించి సమగ్ర నివేదిక తయారుచేయాలని కేంద్రం సీపీడబ్ల్యూడీని ఆదేశించింది.
అధికారిక నివాసానికి పొరుగునున్న నాలుగు ప్రభుత్వ ఆస్తులను చట్టవిరుద్ధంగా విలీనం చేసి విలాసవంతమైన శీష్ మహల్ ను విస్తరించారని దిల్లీ భాజపా అధ్యక్షుడు వీరేంద్ర సన్దేవా సోమవారం ఆరోపించారు. ఆ ఆస్తుల విలీనాన్ని రద్దు చేయాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారు. దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక నూతన ముఖ్యమంత్రి శీష్ మహల్‌లో ఉండబోరని పేర్కొన్నారు.
ఢిల్లీలోని 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను అరవింద్ కేజీవాల్ సీఎంగా ఉన్న సమయంలో అధికారిక నివాసంగా వినియోగించారు. కాగా ఈ బంగ్లాను అద్దాల మేడగా బీజేపీ అభివర్ణిస్తోంది. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి కేజ్రీవాల్ సెవెన్ స్టార్ రిసార్ట్ మార్చుకున్నారని విమర్శించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ మోసాలకు ఆ మహల్ ఓ ఉదాహరణ అంటూ బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఆప్ ప్రభుత్వంపై వచ్చిన ఈ అవినీతి ఆరోపణలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బతీసి, బీజేపీకి విజయాన్ని కట్టబెట్టాయి. ఈ నేపథ్యంలోనే విమర్శలకు తావులేకుండా ఆ బంగ్లాకు దూరంగా ఉండాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం.