'బేబీ', 'ఐ లవ్ యూ' అని మెసేజ్‌లు పెట్టేవాడట.. పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన చైతన్యానంద మురికి పనులు
దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ విద్యార్థినుల ఆరోపణలతో స్వామి చైతన్యానంద సరస్వతి గురించి కొత్త విషయాలు వెల్లడయ్యాయి.
By - Medi Samrat |
దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ విద్యార్థినుల ఆరోపణలతో స్వామి చైతన్యానంద సరస్వతి గురించి కొత్త విషయాలు వెల్లడయ్యాయి. ఎన్‌డిటివి నివేదిక ప్రకారం.. చైతన్యానంద సరస్వతి విద్యార్థినుల మొబైల్ ఫోన్‌లలో 'బేబీ' మరియు 'ఐ లవ్ యు' వంటి సందేశాలను పంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుల విచారణలో ఇంకా ఏం వెలుగులోకి వచ్చిందో తెలుసుకుందాం.
ఈ విషయం పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో పోలీసులు మొదట్లో దాచిపెట్టారు, కానీ మీడియా హెడ్‌లైన్‌లలోకి వచ్చిన తరువాత, పోలీసులు ఈ విషయంలో దర్యాప్తు పరిధిని పెంచారు. చైతన్యానంద మొబైల్ ద్వారా విద్యార్థినులకు పలు అసభ్యకర సందేశాలు పంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడి కావడంతో పోలీసుల అనుమానం మరింత పెరుగుతోంది. చైతన్యానంద విద్యార్థినులను గదిలోకి పిలిచేవాడు.. ఒప్పుకోకుంటే కెరీర్ నాశనం చేస్తానని బెదిరించేవాడు.
శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ విద్యార్థులు చైతన్యానందపై పలు తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. చైతన్యానంద బెదిరింపులకు పాల్పడుతూ అర్థరాత్రి తన గదికి పిలిచేవాడని బాలికలు తెలిపారు. ఫారిన్ ట్రిప్పులతో ప్రలోభపెట్టి పరీక్షల్లో మంచి మార్కులు వేయిస్తానని ట్రాప్ చేసేందుకు ప్రయత్నించేవాడు.
వాట్సాప్‌లో అభ్యంతరకర సందేశాలు పంపేవాడని విద్యార్థినులు ఆరోపించారు. తన మాట వినకుంటే కెరీర్ పాడు చేస్తానని బెదిరించేవాడు. ఈ కేసులో ముగ్గురు మహిళా వార్డెన్ల పేర్లు కూడా బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాధిత బాలికలు తమ ఫిర్యాదుపై దర్యాప్తు జరగకుండా అణిచివేసారని, చైతన్యానంద పంపిన వాట్సాప్ సందేశాలను తొలగించారని ఆరోపించారు.
ఆయన యువ విద్యార్థినులను ఉద్దేశించి 'బేబీ', 'ఐ లవ్ యు' మరియు 'ఐ ఆడోర్ యు' వంటి సందేశాలు పంపేవాడని.. అమ్మాయిల జుట్టును, దుస్తులను పొగడుతూ సహా వారి రూపాన్ని గురించి వ్యాఖ్యానించాడని పోలీసు దర్యాప్తులో వెల్లడైందని NDTV నివేదించింది.
అదే సమయంలో 50 మందికి పైగా విద్యార్థినుల ఫోన్‌ల నుంచి చాట్‌లు డిలీట్ అయినట్లు పోలీసులకు తెలిసింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చైతన్యానందను కలవడానికి వార్డెన్ తమను తీసుకెళ్లారని కొందరు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యానంద ఆర్థికంగా వెనుకబడిన బాలికలను మాత్రమే ట్రాప్ చేయడానికి ప్రయత్నించేవాడు. ఎందుకంటే వారు ఇక్కడ EWS కోటాలో చదువుతున్నారు. వారి కెరీర్ చెడిపోతుందనే భయంతో వారు ఎవరికీ ఏమీ చెప్పరని బరితెగించాడు.
చైతన్యానంద ఆచూకీ కోసం పోలీసు బృందాలు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతడు మొబైల్‌ను చాలా అరుదుగా ఉపయోగిస్తాడు. దీంతో అతడి ఆచూకీ కూడా పోలీసులకు చిక్కలేదు. అయితే అతడి చివరి లొకేషన్ ఆగ్రాలో దొరికిందని, త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.