మైనర్‌తో శృంగారం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

శుక్రవారం నాడు సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 కింద తన అసాధారణ అధికారాలను ఉపయోగించి మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు దోషిగా తేలిన వ్యక్తికి ఎటువంటి శిక్ష విధించలేదు

By Medi Samrat
Published on : 23 May 2025 5:44 PM IST

మైనర్‌తో శృంగారం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

శుక్రవారం నాడు సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 కింద తన అసాధారణ అధికారాలను ఉపయోగించి మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు దోషిగా తేలిన వ్యక్తికి ఎటువంటి శిక్ష విధించలేదు. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం, ఇప్పుడు ఆ వ్యక్తి భార్య అయిన బాధితురాలు ఈ చర్యను నేరంగా పరిగణించలేదని, సంఘటనకు సంబంధించిన చట్టపరమైన పరిణామాల కారణంగా ఎక్కువ బాధపడ్డారని పేర్కొంది.

పోక్సో కేసు విషయంలో సుప్రీంకోర్టు ఈ అరుదైన తీర్పు ఇచ్చింది. బాలికతో లైంగిక సంబంధం కొనసాగించినందుకు బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. ఆ వ్యక్తికి ట్రయల్‌ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దానిని సవాల్‌ చేస్తూ అతడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం 2023 అక్టోబరు 18న సంచలన తీర్పు వెలువరించింది. బాలిక అతడితో ఇష్టపూర్వకంగానే సాన్నిహిత్యాన్ని కొనసాగించిందన్న కారణంతో అతడిని నిర్దోషిగా ప్రకటించింది.

ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటో రిట్‌ పిటిషన్‌గా స్వీకరించింది. నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కూడా అత్యున్నత న్యాయస్థానంలో అప్పీలుకు దాఖలు చేసింది. ఆ తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఆ కేసులో నిందితుడికి విధించిన శిక్షను పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, బాధితురాలు అతడిని పెళ్లి చేసుకొని, ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. అందువల్ల పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేసి, బాధితురాలితో చర్చించి కోర్టు విధించిన గడువులో నిపుణుల కమిటీ నివేదిక సీల్డ్ కవర్‌లో అందింది. ఏప్రిల్ 3న ధర్మాసనం బాధితురాలితో కూడా మాట్లాడింది. ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితులు దోషి, ప్రస్తుత కుటుంబ జీవితంలో ఆమెకు ఏర్పడిన భావోద్వేగ బంధాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని ధర్మాసనం తెలిపింది.

Next Story