సునంద ఆత్మ ఇప్పుడే శాంతిస్తుంది : తీర్పుపై ఎంపీ శ‌శిథ‌రూర్ స్పందన

Shashi Tharoor After Verdict On Wife's Death. సునంద పుష్క‌ర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్‌కు ఢిల్లీ సెష‌న్స్‌ కోర్టులో ఊర‌ట ల‌భించింది.

By Medi Samrat  Published on  18 Aug 2021 9:03 AM GMT
సునంద ఆత్మ ఇప్పుడే శాంతిస్తుంది : తీర్పుపై ఎంపీ శ‌శిథ‌రూర్ స్పందన

సునంద పుష్క‌ర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్‌కు ఢిల్లీ సెష‌న్స్‌ కోర్టులో ఊర‌ట ల‌భించింది. ఈ కేసులో శ‌శిథ‌రూర్‌పై ఉన్న అన్ని అభియోగాలను కోర్టు కొట్టివేసింది. 2014, జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్‌లో సునందా పుష్కర్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. సునంద ఆత్మహత్య చేసుకోవ‌డానికి ఓ ర‌కంగా శ‌శిథరూరే కార‌ణ‌మ‌య్యార‌ని 2018లో పోలీసులు చార్జ్‌షీట్ దాఖ‌లు చేశారు. ఈ నేఫ‌థ్యంలో విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం అభియోగాలను కొట్టివేసింది.

తీర్పుపై శశిథరూర్ స్పందిస్తూ.. ఏడున్నరేళ్లుగా తాను అనుభవిస్తున్న నరకానికి ఎట్టకేలకు ముగింపు దొరికిందని అన్నారు. జడ్జిలు గొప్ప తీర్పు ఇచ్చారని ఆయన కొనియాడారు. సునంద పుష్కర్ ఆత్మ ఇప్పుడే శాంతిస్తుందని అన్నారు. నా భార్య సునంద మరణం తర్వాత ఎంతో కాలం నా చుట్టూ అలముకున్న కారు చీకట్లు ఈ తీర్పుతో తొలగిపోయాయి. ఆమె మరణంపై నా మీద ఎన్నెన్నో నిరాధారపూరితమైన ఆరోపణలను మోపారు. మీడియా ఎన్నో అభాండాలను వేసింది. అయితే, ఇప్పుడు వచ్చిన తీర్పు న్యాయవ్యవస్థపై నా నమ్మకాన్ని మరింత పెంచింది. తప్పు చేస్తే మన న్యాయవ్యవస్థ కచ్చితంగా శిక్షిస్తుంది. ఏది ఏమైనా న్యాయం జరిగిందని ఓ ప్రకటనను విడుదల చేశారు.

ఇదిలావుంటే.. శ‌శిథ‌రూర్‌, సునంద పుష్క‌ర్‌కు 2010లో వివాహం జ‌రిగింది. గొడ‌వ‌ల కార‌ణంగా సునంద పుష్క‌ర్ యాంటీ-డిప్రెష‌న్ మాత్ర‌లు తీసుకునే వార‌ని అప్ప‌ట్లో పోలీసులు తెలిపారు. ఆమె బ‌స చేసిన హోట‌ల్‌లో పోలీసుల‌కు 27 అల్‌ప్రాక్స్ మాత్ర‌లు కూడా ల‌భ్య‌మ‌య్యాయి. ఈ కార‌ణాల వ‌ల్ల శ‌శిథ‌రూర్‌పై అభియోగాలు న‌మోదు చేశారు. చివ‌ర‌కు ఆయ‌న‌కు ఢిల్లీ సెష‌న్స్ కోర్టులో ఊర‌ట ల‌భించింది.


Next Story