క్లారిటీ ఇచ్చేసిన శరద్ పవార్
బాబాయ్ శరద్ పవార్‌తో తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రహస్యంగా భేటీ అయ్యారు
By Medi Samrat
బాబాయ్ శరద్ పవార్‌తో తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రహస్యంగా భేటీ అయ్యారు. ఈ భేటీపై ఎన్‌సీపీ అధ్యక్షుడు పవార్ స్పందించారు. తన శ్రేయాభిలాషులు బీజేపీతో కలవాలని కోరుకుంటున్నారని, కానీ ఆ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని శరద్ పవార్ స్పష్టం చేశారు. బీజేపీకి తమ రాజకీయ విధానం పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. పుణేలో శనివారం అజిత్ పవార్‌తో శరద్ పవార్ రహస్యంగా భేటీ అవ్వడంతో మళ్లీ బాబాయ్-అబ్బాయి కలుస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
‘‘అజిత్ నా అన్న కొడుకు..అతడితో సమావేశమైతే తప్పేంటి. ఓ కుటుంబ పెద్ద ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడాలనుకుంటే దాన్నో పెద్ద విషయంగా భావించాల్సిన అవసరం లేదు’’ అని శరద్ పవార్ చెప్పుకొచ్చారు. అజిత్ పవార్‌తో పూణేలో జరిగిన భేటీకి సంబంధించి మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమిలో ఎలాంటి గందరగోళం లేదని శరద్ పవార్ తెలిపారు. MVA ఐక్యంగా ఉందని.. ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1 తేదీలలో ముంబయిలో INDIA కూటమి తదుపరి సమావేశాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని అన్నారు. ఇదే ప్రశ్నను పదే పదే వేసి మరింత గందరగోళం సృష్టించవద్దని పవార్ మీడియాను కోరారు. జాతీయ స్థాయిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఏలో చేరడానికి శరద్ పవార్‌ను ఒప్పించేందుకు అజిత్ పవార్ వర్గం ప్రయత్నాలు చేసిందని అంటున్నారు. ఇద్దరు పవార్‌ల మధ్య జరిగిన సమావేశానికి మహారాష్ట్ర ఎన్‌సిపి చీఫ్ జయంత్ పాటిల్ కూడా హాజరైనట్లు తెలుస్తోంది.