షారుఖ్ ఖాన్ కొడుకుకు డ్రగ్స్ తో లింక్.. ఇప్పటి వరకూ ఏమేమి తేలాయంటే..!
Shah Rukh Khan's Son, Aryan, Questioned About Drugs On Cruise Ship. షారుఖ్ ఖాన్.. పరిచయం అక్కర్లేని పేరు. ఎంత కష్టపడి వచ్చాడో
By M.S.R Published on 3 Oct 2021 8:42 AM GMTషారుఖ్ ఖాన్.. పరిచయం అక్కర్లేని పేరు. ఎంత కష్టపడి వచ్చాడో అందరికీ తెలుసు. ఓ సీరియల్ లో నటించడం ద్వారా మొదలైన అతడి ప్రస్థానం.. దేశం మొత్తం గర్వించదగ్గ హీరోగా ఎదిగాడు. ఇక షారుఖ్ ఖాన్ పెద్ద కొడుకు ఆర్యన్ ఖాన్ పేరు ఇప్పుడు డ్రగ్స్ వివాదంలో బయటకు వచ్చింది. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) శనివారం రాత్రి దాడి చేసింది. పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, మరికొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నాయి. ఇక రేవ్ పార్టీలో పాల్గొన్న ఆర్యన్ ఖాన్ ఫోన్, మరికొందరి ఫోన్లను ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా విచారిస్తే కేసులో కీలక సమాచారం వెల్లడయ్యే అవకాశముంది. ఆర్యన్ ఖాన్‌తోపాటు అతని స్నేహితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా, నూపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా ఎన్‌సీబీ అధికారులు విచారించనున్నారు.
క్రూయిజ్ పార్టీలో చేరడానికి ఢిల్లీ నుంచి వచ్చిన అమ్మాయిలను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో కొందరు ప్రముఖ వ్యాపారవేత్తల కుమార్తెలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. క్రూయిజ్ పార్టీ ఆర్గనైజర్లకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. ఎఫ్‌టీవీ డైరెక్టర్ ఖాసిఫ్ ఖాన్ పర్యవేక్షణలోనే ఈ పార్టీ జరిగినట్టుగా తెలుస్తోందని ఎఫ్‌టీవీ అధికారులు తెలిపారు. అయితే షారుక్ తనయుడు ఆర్యన్‌పై ఇప్పటి వరకూ ఎలాంటి కేసు నమోదు కాలేదు. అతన్ని అరెస్ట్ కూడా చేయలేదని ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడె వెల్లడించారు. ఈ క్రూజ్ పార్టీ ప్లాన్ చేసిన ఆరుగురు ఆర్గనైజర్లకు కూడా ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. రేవ్ పార్టీ తర్వాత సీజ్ చేసిన ఫోన్లకు వచ్చిన మెసేజ్‌లను పరిశీలిస్తున్నారు.
క్రూజ్ షిప్‌పై దాడి చేసి అక్కడి నుంచి ఎక్స్‌టసీ, కొకైన్, మెఫిడ్రోన్, చరస్‌లాంటి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ వెల్లడించింది. ఈ దాడుల సందర్భంగా 8 మందిని అదుపులోకి తీసుకుంది. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. కార్డెలియా అనే ఈ క్రూజ్ షిప్‌పై దాడి చేసినట్లు ఎన్సీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్రూజ్ ముంబై నుంచి గోవా వెళ్తోంది. తమ క్రూజ్‌లో ప్రయాణిస్తున్న వాళ్ల దగ్గర నుంచి నార్కోటిక్స్ అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఈ క్రూజ్ ప్రెసిడెంట్, సీఈవో జుర్గెన్ బైలోమ్ తెలిపారు. శనివారం రాత్రి బాలీవుడ్, ఫ్యాషన్, బిజినెస్ రంగాలకు చెందిన ప్రముఖలతో ఈ క్రూజ్ షిప్ మూడు రోజుల ప్రయాణానికి బయలు దేరింది.