సంచ‌ల‌నం.. పోక్సో కేసుల్లో ఒకే రోజు ఏడుగురు రేపిస్టులకు జీవిత ఖైదు

గుజరాత్‌లోని మూడు జిల్లాల్లోని కోర్టులు ఒకే రోజు పోక్సో కేసుల్లో ఏడుగురు రేపిస్టులకు జీవిత ఖైదు విధించాయి.

By Medi Samrat  Published on  28 Feb 2025 3:58 PM IST
సంచ‌ల‌నం.. పోక్సో కేసుల్లో ఒకే రోజు ఏడుగురు రేపిస్టులకు జీవిత ఖైదు

గుజరాత్‌లోని మూడు జిల్లాల్లోని కోర్టులు ఒకే రోజు పోక్సో కేసుల్లో ఏడుగురు రేపిస్టులకు జీవిత ఖైదు విధించాయి. అమ్రేలి, వడోదర, రాజ్‌కోట్ జిల్లాల్లోని వివిధ కోర్టుల నిర్ణయాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అత్యాచారం వంటి నేరాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ చెప్పారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, దోపిడీలు, అత్యాచారాలను అరికట్టాలని రాష్ట్ర అధికారులకు సీఎం కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారని హోంమంత్రి తెలిపారు. ఇలాంటి కేసులో పోలీసులు పక్కా ఆధారాలతో కేసును పటిష్టం చేయాలని, నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూడాలని హోంమంత్రి అన్నారు. బాధితుల పట్ల కూడా సున్నితంగా వ్యవహరించాలని కోరారు.

ఫిబ్రవరి 25న అమ్రేలి, వడోదర, రాజ్‌కోట్‌ జిల్లాల్లోని పోక్సో కేసుల్లో కోర్టులు 7 కీలక తీర్పులు ఇచ్చాయని హర్ష్‌ సంఘ్వీ తెలిపారు. వీరిలో 7 మంది రేపిస్టులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మూడు జిల్లాల్లో ఏడుగురు బాధితులకు న్యాయం జరిగిందన్నారు. అమ్రేలి, వడోదర, రాజ్‌కోట్ పోలీసులు మైనర్లపై అత్యాచారం, ఇతర తీవ్రమైన పోక్సో కేసులపై వివరణాత్మక దర్యాప్తు చేశారని హోం మంత్రి తెలిపారు. సాంకేతిక సహా ఇతర ఆధారాలను సేకరించారు. సమర్థవంతమైన వాదనలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా, మొత్తం ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు విధించబడిందని వెల్ల‌డించారు.

అమ్రేలి జిల్లాలో రెండు కేసుల్లో నిందితులను అరెస్టు చేసిన 17 రోజుల్లోనే చార్జిషీట్లు దాఖలు చేసినట్లు హోంమంత్రి తెలియజేశారు. మూడో కేసులో నిందితులను ఘటన జరిగిన రోజునే పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్‌కోట్‌లో జరిగిన అత్యాచారం, హత్య కేసులో 40 రోజుల్లోనే ఛార్జ్‌షీటు దాఖలైంది. ఘటన జరిగిన రోజునే పట్నావ్ కేసులో నిందితులను రాజ్‌కోట్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. భయవదార్ కేసులో 7 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేశారు.

అమ్రేలి, వడోదర, రాజ్‌కోట్ జిల్లాల్లో ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాన్ని హోంమంత్రి హర్ష్ సంఘ్వి అభినందించారు. నేరస్తులపై కఠిన చర్యలు కొనసాగుతాయని చెప్పారు. గత 3 సంవత్సరాలలో గుజరాత్ కోర్టులు పోక్సోకు సంబంధించిన 947 కేసులలో తీర్పులు ఇచ్చాయి. వీరిలో 574 మంది దోషులకు జీవిత ఖైదు, 11 మందికి మరణశిక్ష విధించారు.

Next Story