నిజ‌మైతే.. నిస్సందేహంగా అది తీవ్రమైన విషయమే

Serious Allegations If Reports Are True.. Truth Has To Come Out. గూఢచర్యం ఆరోపణల్లో వాస్తవం ఉంటే.. అటువంటి చర్యకు పాల్పడటం

By Medi Samrat  Published on  5 Aug 2021 9:16 AM GMT
నిజ‌మైతే.. నిస్సందేహంగా అది తీవ్రమైన విషయమే

గూఢచర్యం ఆరోపణల్లో వాస్తవం ఉంటే.. అటువంటి చర్యకు పాల్పడటం చాలా తీవ్రమైన విష‌యం అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు. పెగాసస్ వివాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ద‌ర్యాప్తు జరపాలని కోరుతూ ఎన్ రామ్, మరికొందరు దాఖలు చేసిన‌ పిటిషన్లపై కోర్టు గురువారం విచారణ జరిపింది. పిటీషనర్లు తరపున సీనియర్ న్యాయ‌వాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. పెగాసస్ ఓ రోగ్ టెక్నాలజీ అని.. ఇది మనకు తెలియకుండానే మన జీవితాల్లోకి ప్రవేశిస్తోందన్నారు. ఇది మన దేశ విలువలు, వ్యక్తిగత గోప్యత, గౌరవ, మర్యాదలపై జ‌రుగుతున్న‌ దాడి అని అన్నారు.

పెగాస‌స్‌ స్పైవేర్‌ను కేవలం ప్రభుత్వ వ్యవస్థలకు మాత్రమే అమ్ముతున్నారని.. ప్రైవేటు సంస్థలు దీనిని సంపాదించడం సాధ్యం కాదని అన్నారు. ఈ స్పైవేర్‌తో.. పాత్రికేయులు, కోర్టు ఆఫీసర్స్, విద్యావేత్తలు, రాజ్యాంగ అధికారులపై నిఘా పెడుతున్నారని.. దీనిని ఎవరు కొన్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని.. దీనికి సంబంధించిన హార్డ్‌వేర్‌ను ఎక్కడ పెట్టారో తెల‌పాలన్నారు. ప్రభుత్వం దీనిపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని.. ఈ విష‌య‌మై కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేయాలని కోరారు.

దీనిపై జస్టిస్ రమణ స్పందిస్తూ.. గూఢచర్యం జ‌రుగుతున్న‌ట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే.. నిస్సందేహంగా ఇది తీవ్రమైన విషయమేనని అన్నారు. గూఢచర్యం.. నిఘా జరుగుతున్నట్లు 2019లో ఆరోపణలు వచ్చాయన్నారు. మరింత సమాచారం తెలుసుకోవడానికి ఏమైనా కృషి జరుగుతోందో.. లేదో తనకు తెలియదన్నారు. ఈ పిటీషన్లపై తదుపరి విచారణ మంగళవారం జరుగుతుంది.




Next Story