తల్లిదండ్రులు సేఫ్‌గా ఉన్నారా.?
డబ్బులు సంపాదిస్తున్న పిల్లలు తమ తల్లిదండ్రులను దూరంగా ఉంచుతూ ఉన్నారు.
By Medi Samrat
డబ్బులు సంపాదిస్తున్న పిల్లలు తమ తల్లిదండ్రులను దూరంగా ఉంచుతూ ఉన్నారు. చాలా మందికి సరైన సెక్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు. ఏదో ఒక ఇంటిని రెంట్ కు తీసుకోవడం, అక్కడ తల్లిదండ్రులను ఉంచేయడం, వారి బాగోగుల కోసం పనివాళ్లను ఉంచడం కూడా చాలా కామన్ అయిపోయింది. అయితే అలా ఉంచిన పనివాళ్లు డబ్బులకు కక్కుర్తి పడి ఏదైనా చేయరానిది చేస్తే? దేశ రాజధానిలో వయోవృద్ధుల మీద దాడులు ఇటీవలి కాలంలో ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి.
గత అక్టోబర్‌లో దక్షిణ ఢిల్లీలోని 76 ఏళ్ల వృద్ధురాలిపై దాడి జరిగింది. ఇంట్లో పని చేసే వారే ఈ దాడికి తెగబడ్డారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసినప్పుడు జూలై 2024లో అశోక్ విహార్‌లో కూడా ఇలాంటి నేరానికే పాల్పడినట్లు తేలింది. నిందితుడు ఒక నెలలోనే జైలు నుండి బయటకు వచ్చి, నగరంలోని మరొక ప్రాంతంలో ఉద్యోగం సంపాదించాడు.
ఎవరు పడితే వారిని వృద్ధులకు సహాయకుడిగా పెట్టడంతో ముప్పు పెరుగుతోంది. ఇది పోలీసులకు తీవ్రమైన సవాలుగా మారింది. దేశ రాజధానిలో గత సంవత్సరంలో సీనియర్ సిటిజన్లపై వరుస నేరాలు వారి భద్రత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయి.
ఢిల్లీలో సీనియర్ సిటిజన్లపై గణనీయమైన సంఖ్యలో నేరాలు జరిగాయి. 2022లో 1,313 కేసులు నమోదయ్యాయి, 2021లో 1,166 కేసులు, 2020లో 906 కేసులు నమోదయ్యాయి. జనవరి- సెప్టెంబర్ 2023 మధ్య సీనియర్ సిటిజన్లపై నేరాలు 35% పెరగడంతో పరిస్థితి మరింత దిగజారుతున్నట్లు డేటా చూపిస్తుంది. ఇక సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ క్రైమ్ కేసులు కూడా పెరిగాయి.