పార్లమెంట్‌లోని శివసేన కార్యాలయాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీ వర్గానికి కేటాయించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. షిండే వర్గానికి చెందిన ఫ్లోర్ లీడర్ రాహుల్ షెవాలే రాసిన లేఖపై లోక్‌సభ సెక్రటేరియట్ స్పందిస్తూ.. పార్లమెంటు భవనంలోని శివసేన కార్యాలయం కోసం కేటాయించిన గదిని ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీ వర్గానికి కేటాయించినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.
ఈసీ గత వారం ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించింది. ఎన్నికలలో "విల్లు, బాణం" చిహ్నాన్ని ఉపయోగించడానికి అనుమతిస్తూ.. ఉద్ధవ్ ఠాక్రే వాదనను తిరస్కరించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 18న ఫ్లోర్ లీడర్ రాహుల్ షెవాలే లోక్‌సభ సెక్రటేరియట్‌కు.. పార్టీకి కార్యాలయాన్ని కేటాయించాలని కోరుతూ లేఖ రాశారు. ఇప్పటి వరకు పార్లమెంటు భవనంలోని శివసేన కార్యాలయాన్ని ఇరు వర్గాలు ఉపయోగించుకుంటున్నాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పార్టీ పేరు, విల్లు-బాణం ఎన్నికల గుర్తుపై పట్టు సాధించారు. ఈ క్రమంలోనే శివసేన జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన కొద్ది క్షణాల్లోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల సంఘం ప్రకటన తర్వాత తొలిసారిగా జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర శివసేన నేతలు హాజరుకానున్నారు. కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకం వంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.